Local Elections: సర్పంచ్ ఎన్నికలకు మోగనున్న నగారా! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్‌కు కూడా..

by Shiva |   ( Updated:2025-01-06 02:24:47.0  )
Local Elections: సర్పంచ్ ఎన్నికలకు మోగనున్న నగారా! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్‌కు కూడా..
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మార్చి 2 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్​పరీక్షలు, మార్చి 21 నుంచి ఏప్రిల్​2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్, ప్రవేశపరీక్షలు వరుసగా నిర్వహిస్తుండటంతో అంతకుముందే స్థానిక ఎన్నికలను పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల నివేదికకు డెడికేటెడ్​కమిషన్​సిద్ధం చేసింది. దానిని త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నది. అనంతరం కేబినెట్​భేటీలో రిజర్వేషన్లపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది. అందుకు అనుగుణంగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసి వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందించనున్నది.

అటు పథకాల అమలు.. ఇటు ఎన్నికలు..

ఈ నెల 26న రైతుభరోసా, భూమిలేని రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం వంటి పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వాటితోపాటు కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. వీటి వల్ల మైలేజ్ వస్తుందని, అదే టైంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజకీయంగా మంచి ఫలితాలు ఉంటాయని భావిస్తున్నట్టు టాక్. ఆదివారం నిర్వహించిన జిల్లా పంచాయతీ అధికారుల సమీక్షా సమావేశంలో పంచాయతీ ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్టుగా సమాచారం. జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంతా డీపీవోల పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తం కావాలనే సంకేతాలు ప్రభుత్వం తరఫున ఇచ్చినట్టుగా సమాచారం.

నెలాఖరులోగా కొత్త ఎంపీటీసీ స్థానాలు

ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలని ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఇప్పటికే ఉభయ సభలు దీనిని ఆమోదించగా.. గవర్నర్​నుంచి గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉంది. అది పూర్తవ్వగానే జిల్లాలకు ఆదేశాలు ఇచ్చి అవసరమైన మండలాల్లో కొత్త ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేస్తారు. ఈ నెలాఖరు కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

మూడు విడతల్లో ఎన్నికలు

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బ్యాలెట్​పేపర్ల ముద్రణ పూర్తయింది. బ్యాలెట్​బాక్సులు సైతం జిల్లాలకు చేరాయి. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయగానే ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నది. గతంలోనే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సమయాన్ని తగ్గించారు. దీంతో నోటిఫికేషన్ వెలువడిన కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ పూర్తవుతాయి. ఓటింగ్ జరిగిన రోజునే కౌంటింగ్ సైతం​పూర్తవుతుంది. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. ఇందుకు మూడు వారాల కన్నా ఎక్కువ సమయం పట్టదని సమాచారం.

కేంద్రం నుంచి నిలిచిన నిధులు

సర్పంచ్‌ల పదవీకాలం దాదాపుగా 11 నెలల క్రితం ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. దీని వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,600 కోట్లు నిలిచిపోయాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించిన వెంటనే ఆ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఎన్నికలు త్వరగా పూర్తి చేయాలని సర్కారు భావిస్తున్నది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేసింది. గ్రామ పాలకవర్గం తీర్మానం లేకుండా అభివృద్ధి పనులు చేయడం అసాధ్యం కావడం, నిబంధనలు కఠినంగా ఉండటంతో గ్రామాల్లో అభివృద్ధి పనుల జాప్యానికి కారణమని పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొత్తగా మరో 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందాయి. వీటికి కేబినేట్ ఆమోదం తెలపాల్సి ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed