Local Elections: సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి.. రాష్ట్రానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖ

by Shiva |
Local Elections: సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి.. రాష్ట్రానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే కసరత్తు చేసినా ఆశించిన మేరకు పురోగతి లేకపోవడంతో అనిశ్చితి నెలకొన్నది. ఇదే సమయంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి రాష్ట్రానికి లేఖ వచ్చింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్న టైంలో ఈ లేఖ రావడం గమనార్హం. రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్నందున కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలనా వ్యవస్థ అనివార్యం కావడంతో ఈ లేఖ రాసినట్లు రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. అయిదే విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు. పంద్రాగస్టు తర్వాత దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

ఒకేసారి నిర్వహించాలని సర్కారు భావన

తొలుత రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిం చింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో బీసీ రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉన్నది. ఇందు కోసం కసరత్తు మొదలైనా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పోలింగ్ బూత్‌లవారీగా ఓటర్ల జాబితా రాకపోవడంతో ఆ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. మరోవైపు కులగణన చేపట్టిన తర్వాత బీసీల జనాభా పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నా ఆ ప్రాసె స్‌కు సమయం పట్టొచ్చన్న భావనతో ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలని రాష్ట్ర సర్కారు భావించింది. రైతు రుణమాఫీని పంద్రాగస్టులోపే పూర్తి చేస్తామంటూ సీఎం గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.లక్షన్నర వరకు రుణం ఉన్న రైతులకు ప్రభుత్వం మాఫీ చేసింది. తుది విడత రుణమాఫీ కోసం కసరత్తు జరుగుతున్నది. ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయితే రైతుల్లో భారీ స్థాయిలో ఉపశమనం కలుగుతుందని, వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే పొలిటికల్‌గా ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ నేతల భావన.

రాష్ట్రంలో మొత్తం పంచాయతీలెన్నీ!

రాష్ట్రంలో ప్రస్తుతం 12,751 గ్రామ పంచాయతీలు (కొత్తగా ఏర్పాటు చేసినవి కలిపితే మొత్తం 12,772) ఉన్నాయి. మొత్తంగా 12,772 మంది సర్పంచ్‌లను, సుమారు 1.27 లక్షల మంది వార్డు సభ్యులను ప్రజలు ఎన్నుకోవాల్సి ఉన్నది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం (2018) ప్రకారం సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత పర్సన్ ఇన్‌చార్జిలను నియమించే అవకాశం లేదు. దీంతో పాటు సకాలంలో ఎన్నికలు జరగకపోతే గ్రామ పంచాయితీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాల్సి ఉంటుంది.

పంచాయతీ ఎన్నికల ప్రతిపాదనలు

భారత రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపే.. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు పూర్తి చేయాలి. ఈ క్రమంలో రాష్ట్రంలో జనవరి లేదా ఫిబ్రవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. కానీ దీనిపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఆ వెంటనే లోకసభ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో.. కనీసం ఆరు నెలల వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోయింది. దీంతో అప్పటివరకు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించింది.

అక్టోబర్ తర్వాత..

పంచాయతీ ఎన్నికలు తొందరగా నిర్వహించాలని కేంద్రం సూచిస్తూ ఉంటే... అక్టోబర్ తర్వాత నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల నుంచి వ్యక్తమవుతున్నది. బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ఆధారపడి ఎన్నికల తేదీలు ఫిక్స్ కావాల్సి ఉంటుంది. బీసీ జనాభా దామాషా మేరకు రిజర్వేషన్ల ఖరారు చేయాల్సి ఉన్నందున క్షేత్రస్థాయి అధ్యయనం, ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సి ఉన్నది. మొత్తం రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా జనాభా దామాషా ప్రకారం పోగా మిగిలింది బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌ ఖరారులో ఏ మాత్రం తేడాలొచ్చినా అది కోర్టుకు చేరి మొత్తం ఎలక్షన్ పైనే ప్రభావం చూపుతుందన్నది ప్రభుత్వ ఆందోళన. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 23 శాతానికి తగ్గించి 2019లో స్థానిక ఎన్నికలను నిర్వహించడంతో పలువురు కోర్టుకు వెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed