లిక్కర్ పాలసీ A to Z .. అసలేం జరిగిందంటే?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-03 02:31:40.0  )
లిక్కర్ పాలసీ A to Z .. అసలేం జరిగిందంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ (2021-22) కుంభకోణం ప్రకంపనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏకకాలంలో సీబీఐ, ఎన్‌ఫోర్స్ మెంట్ దర్యాప్తు సంస్థలు నిందితులను, అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నాయి. ఊహకు అందని తీరులో కొత్త వ్యక్తుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించిన ఎక్సయిజ్ పాలసీ అయినప్పటికీ దానికి సంబంధించిన అవినీతి, అవకతవకలు, అక్రమాలు దక్షిణాది రాష్ట్రాల వరకూ వ్యాపించినట్లు ఈ రెండు సంస్థల దర్యాప్తుతో బైటపడింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త, రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యాపారులు, ఈ ఇద్దరు రాజకీయ నాయకులకు సన్నిహితంగా ఉన్న పలువురి పేర్లు సీబీఐ, ఈడీ చార్జిషీట్లలో వెలుగులోకి వచ్చాయి. వందలాది కోట్ల రూపాయలు రాజకీయ నాయకులు, లిక్కర్ వ్యాపారులు, పలు కంపెనీల నుంచి ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ఆ రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ అధికారులకు ముడుపులుగా వెళ్లినట్లు బయటపడింది.

వ్యాపారానికి అనుకూలంగా నిబంధనలను మార్చడానికి ఢిల్లీ ఆప్ నేతలకు, ఎక్సయిజ్ అధికారులకు కిక్ బ్యాక్ రూపంలో ముట్టచెప్పినట్లు చార్జిషీట్లలో ఈ సంస్థలు పేర్కొన్నాయి. దానికి ప్రతిఫలంగా వ్యాపారులకు పన్ను రూపంలో భారీ స్థాయిలో కమిషన్ పెంచడం జరిగిందని వ్యాఖ్యానించాయి. ఒక పథకం ప్రకారం పాలసీ రూపకల్పన మొదలు అమలు వరకు ఇరువైపులా లాభాలను చూసుకున్నారని, చివరకు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని రెండు సంస్థలూ ఆరోపించాయి.

ఢిల్లీ లిఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఫిర్యాదుతో కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. నిపుణుల కమిటీ, మంత్రుల బృందం, మంత్రివర్గ నిర్ణయం తదితరాలన్నీ దాటి చివరకు కొత్త పాలసీని రూపొందించడం ద్వారా ఖజానాకు రూ. 2,873 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ సంస్థ పేర్కొన్నది. ఇంతకూ ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ ఏంటి, అందులోని లొసుగులేంటి? ఎవరెవరి ప్రమేయం ఉన్నది? ఏ నేతకు అందిన ముడుపులెన్ని..? తదితర అంశాలపై ‘దిశ’ స్పెషల్ ఫోకస్.

పాత పాలసీ ప్రకారం ప్రతి 750 మి.లీ. లిక్కర్ (ఉదాహరణకు ఒక బ్రాండ్) బాటిల్‌

పన్ను పాత పాలసీ కొత్త పాలసీ

(రూ.లో) (రూ.లో)

హోల్‌సేల్ ధర 166.73 188.41

స్టేట్ ఎక్సయిజ్ డ్యూటీ 223.89 1.88

వ్యాట్ 106 1.90

రిటైలర్ మార్జిన్ 33.35 363.27

ఎమ్మార్పీ 530 555.76

అదనపు ఎక్సయిజ్​ నిల్ 4.54

చివరి ధర 530 560

ప్రభుత్వ ఆదాయం 329.89 8.32

కొత్త లిక్కర్ పాలసీ పరిణామాలు

సెప్టెంబరు 4, 2020 : కొత్త పాలసీ (2021-22) తయారీ కోసం ఎక్సయిజ్ కమిషనర్ రవి ధావన్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆదేశం

జనవరి 5, 2021 : ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్రజైన్, కైలాశ్​ గెహ్లాట్‌తో కూడిన మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) ఏర్పాటుకు మంత్రివర్గ నిర్ణయం.

మార్చి 22, 2021 : మంత్రుల బృందం నివేదిక రెడీ. క్యాబినెట్ మీటింగుకు సమర్పణ. ఈ రిపోర్టును అమలుచేసి 2021-22 సంవత్సరానికి పాలసీ తయారుచేయాల్సిందిగా ఎక్సయిజ్ శాఖకు ఆదేశం.

మే 21, 2021 : కొత్త ఎక్సయిజ్ పాలసీకి ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం

నవంబరు 8, 2021 : ఫారిన్ లిక్కర్ ధరల విషయంలో సంబంధిత అథారిటీ నుంచి అనుమతి లేకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపణ.

జూలై 20, 2022 : కొత్త ఎక్సయిజ్ పాలసీలో అవకతవకలు, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే నిర్ణయాలు ఉన్నాయంటూ కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లాకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లేఖ

జూలై 22, 2022 : లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి వచ్చిన లేఖ మేరకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశం.

ఆగస్టు 17 , 2022 : సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు. నిందితులుగా ఢిల్లీ ఎక్సయిజ్ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లు.

ఆగస్టు 22, 2022 : మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ రంగంలోకి.

సెప్టెంబరు 6, 2022 : లిక్కర్ స్కామ్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై హైదరాబాద్‌లోని అరుణ్ రామచంద్రన్ పిళ్ళైకు చెందిన రాబిన్ డిస్టిల్లరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలు, ఆయన నివాసంపైనా (ఆరుచోట్ల) ఈడీ సోదాలు.

సెప్టెంబరు 17, 2022 : కల్వకుంట్ల కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు ఆఫీసు, నివాసంలో తనిఖీలు

సెప్టెంబరు 21, 2022 : మనీ లాండరింగ్ ఆరోపణలపై అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డిని ప్రశ్నించిన ఈడీ.

అక్టోబరు 7, 2022 : ఆంధ్రప్రభ, ఇండియా ఎహెడ్ టీవీ చానెల్ నిర్వాహకుడు ముత్తా గౌతమ్‌పై విచారణ కార్యాలయాల్లో ఆ సంస్థ సోదాలు.

అక్టోబరు 10, 2022 : లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉందని బోయిన్‌పల్లి అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ. అరెస్టు చేసినట్లు ప్రకటన.

అక్టోబరు 12, 2022 : ఆంధ్రప్రభ ఎండీ ముత్తా గౌతమ్‌ను అరెస్టు చేసిన సీబీఐ.

అక్టోబరు 17, 2022 : డిప్యూటీ సీఎం సిసోడియాను ప్రశ్నించిన సీబీఐ

నవంబరు 10, 2022 : అరబిందో ఫార్మా శరత్‌చంద్రారెడ్డిని అరెస్టు చేసిన ఈడీ

నవంబరు 14, 2022 : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్, బోయిన్‌పల్లి అభిషేక్‌ను అరెస్టు చేసిన ఈడీ. (గతంలో వీరిద్దరినీ సీబీఐ అరెస్టు చేసింది)

నవంబరు 16, 2022 : దినేశ్​ అరోరా అప్రూవర్‌గా మారడానికి స్పెషల్ కోర్టు అనుమతి.

నవంబరు 25, 2022 : ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో తొలి చార్జిషీటును 10 వేల పేజీలతో సమర్పించిన సీబీఐ. ఇందులో మనీష్ సిసోడియాను నిందితుడిగా పేర్కొనకపోగా అభియోగాలనూ ప్రస్తావించలేదు.

నవంబరు 26, 2022 : లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ ఉల్లంఘనల ఆపణలపై ఫస్ట్ చార్జిషీట్‌ను ఫైల్ చేసిన ఈడీ.

నవంబరు 29, 2022 : సౌత్ గ్రూపు కీలక పాత్ర పోషించినట్లు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఈడీ. కల్వకుంట్ల కవిత రెండు వేర్వేరు నెంబర్లతో మొత్తం పది మొబైల్ ఫోన్లను మార్చడం, డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు. తొలిసారి వెలుగులోకి వచ్చిన కవిత పేరు.

డిసెంబరు 6, 2022 : విచారణకు హాజరు కావాలంటూ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసు.

డిసెంబరు 11, 2022 : కొన్ని కారణాలతో డిసెంబరు 6 విచారణకు హాజరుకానందున ఆమె నివాసానికి వచ్చిన సీబీఐ ఉదయం మొదలు సాయంత్రం వరకు ఎంక్వయిరీ. సీఆర్‌‌పీసీ 191 కింద మరో నోటీసు జారీ.

జనవరి 06, 2023 : స్పెషల్ కోర్టులో రెండో చార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రస్తావించి సమీర్ మహేంద్రుతో మాట్లాడినట్లు వెల్లడి.

ఫిబ్రవరి 08, 2023 : కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసిన సీబీఐ.

ఫిబ్రవరి 25 : సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, దినేష్ అరోరా, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, అమిత్ అరోరా తదితరులను ఆస్తులను జప్తు చేసిన ఈడీ.

ఫిబ్రవరి 18 , 2022 : విచారణకు హాజరుకావాల్సిందిగా మనీష్ సిసోడియాకు సమన్లు పంపిన సీబీఐ. రాష్ట్ర బడ్జెట్ తయారీ పనుల కారణంగా హాజరుకాలేనని, మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి

ఫిబ్రవరి 26 : మనీష్ సిసోడియా విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని ఖరారు చేసిన సీబీఐ. ఎనిమిది గంటల పాటు సీబీఐ హెడ్ క్వార్టర్‌లో విచారించిన అధికారులు సాయంత్రానికి అరెస్టు చేసినట్టు ప్రకటన.

స్కామ్‌లో కవితకు ఉన్న సంబంధం?

ఈ కుంభకోణంలో సీబీఐ ఆమెను ఒక సాక్షిగా విచారించి స్టేట్‌మెంట్ రూపంలో వివరాలను రికార్డు చేసుకున్నది. ఆ తర్వాత ఈడీ సమర్పించిన తొలి చార్జిషీట్‌లో ఆమెకు ఈ స్కామ్‌లో ఉన్న సంబంధం గురించి ప్రస్తావించింది. ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన జరిగే సమయంలోనే సమీర్ మహేంద్రుతో అరుణ్ రామచంద్రన్ పిళ్లై ద్వారా కవిత ఫోన్‌లో మాట్లాడినట్లు ఈడీ పేర్కొన్నది. వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి సౌత్ గ్రూపు పేరుతో ఢిల్లీలోని లిక్కర్ రిటెయిల్ వ్యాపారంలోకి రావాలని ఆసక్తి చూపినట్లు ఈడీ ఆరోపణ.

ఎంపీ మాగుంట తరఫున ఆయన కుమారుడు రాఘవ, ప్రేమ్ రాహుల్ ప్రతినిధులుగా ఉంటారని, కవిత తరఫున పిళ్లై, బోయిన్‌‌పల్లి అభిషేక్, ఆడిటర్ బుచ్చిబాబు ప్రతినిధులుగా ఉన్నారని ఈడీ వెల్లడించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో భాగస్వాములుగా చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు పిళ్లై ద్వారా సమీర్ మహేంద్రుకు కవిత చెప్పినట్లు ఈడీ పేర్కొన్నది. 2022 ప్రారంభంలో సమీర్ మహేంద్రు నేరుగా హైదరాబాద్ వచ్చి కల్వకుంట్ల కవిత నివాసంలో చర్చలు జరిపారు. ఆ సమయంలో ఆమె భర్త అనిల్, గోరంట్ల బుచ్చిబాబు, శరత్‌చంద్రారెడ్డి, పిళ్ళై, బోయిన్‌పల్లి అభిషేక్ తదితరులు ఉన్నట్లు అభియోగం.

ఆ తర్వాత ఢిల్లీలోని ఒబెరాయ్ మెయిడెన్ హోటల్‌లో జరిగిన మీటింగులోనూ కవితతో చర్చించి 65% మేర వాటాలకు సమీర్ అంగీకరించినట్లు ఈడీ కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నది. కవితకు సన్నిహితుడైన వెన్నమనేని శ్రీనివాసరావు ఆమె ఆదేశం మేరకు పిళ్ళై నుంచి కోటి రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అప్పజెప్పినట్లు వెల్లడించింది.

దాదాపు రూ. 100 కోట్ల రూపాయలను అడ్వాన్స్ కిక్‌బ్యాక్ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముట్టచెప్పినందున రీటెయిల్ దుకాణాల్లో ఎల్-1గా నిలిచిన ఇండో స్పిరిట్స్‌లో కవితకు వాటా లభించిందని తెలిపింది. ఇండో స్పిరిట్స్ కంపెనీల్లో ఎక్కడా కాగితాల మీద అధికారికంగా కవిత పేరు ఉండదని, ఆమె తరఫున పిళ్ళై ఉన్నారని వివరించింది. ఇలా తీసుకున్న డబ్బులో నుంచే ముత్తా గౌతమ్ కంపెనీలకు కొంత ఇచ్చినట్లు పిళ్లై తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నట్లు ఈడీ తెలిపింది.

బోయిన్‌పల్లి అభిషేక్ పాత్ర?

లిక్కర్ రీటెయిల్ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రాబిన్ డిస్టిల్లరీస్ కంపెనీలో అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో పాటు బోయిన్‌పల్లి అభిషేక్ కూడా ఒక డైరెక్టరుగా ఉన్నారు. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్‌తో పిళ్ళైకు సంబంధాలు ఉండడంతో బోయిన్‌పల్లి అభిషేక్ కూడా పెట్టుబడులు పెట్టి లిక్కర్ వ్యాపారంపై ఆసక్తి చూపారు. బోయిన్‌పల్లి అభిషేక్‌, కల్వకుంట్ల కవిత సన్నిహిత మిత్రులు. గతంలో తిరుమల ఆలయానికి కూడా పిళ్ళై, కవితతో కలిసి వెళ్లారు.

అరబిందో శరత్‌చంద్రారెడ్డి

ఫార్మా కంపెనీకి చెందిన శరత్‌చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ వ్యాపారంపై ఆసక్తిగా ఉన్నట్లు సమీర్ మహేంద్రుకు విజయ్ నాయర్‌ ద్వారా తెలిసింది. ఆర్థికంగా ఏ మేరకు లాభదాయకంగా ఉంటుందో ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ద్వారా స్టడీ చేయించారు. హోల్‌సేల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా రీటెయిల్ రంగంలోకి ఇంట్రెస్టు చూపారు. ట్రైడెంట్ కెమ్‌ఫార్ కంపెనీ ద్వారా ఐదు రీటెయిల్ జోన్లను కైవసం చేసుకున్నారు.

ఎక్సయిజ్ పాలసీ ప్రకారం ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ రిటెయిల్ జోన్లకు లైసెన్సు పొందడానికి అర్హత లేకపోవడంతో ఆర్గానోమిక్స్ ఈకో సిస్టమ్స్, అవంతికా కాంట్రాక్టర్స్ అనే ప్రాక్సీ కంపెనీల ద్వారా పొందినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. బినామీల ద్వారా మరో నాలుగు రిటెయిల్ జోన్లు కూడా శరత్‌చంద్రారెడ్డికి దక్కాయని, మొత్తంగా తొమ్మిది జోన్లు ఆయన కంట్రోల్‌లో ఉన్నాయని పేర్కొన్నది. ఢిల్లీ లిక్కర్ మార్కెట్‌లో మొత్తం 30% ఈయన నియంత్రణలోనే ఉన్నట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed