Haji Salim : టార్గెట్ ‘హాజీ సలీం‌’.. బడా డ్రగ్స్ స్మగ్లర్‌ మూలాలపై ఎన్‌సీబీ ఫోకస్

by Hajipasha |
Haji Salim : టార్గెట్ ‘హాజీ సలీం‌’.. బడా డ్రగ్స్ స్మగ్లర్‌ మూలాలపై ఎన్‌సీబీ ఫోకస్
X

దిశ, నేషనల్ బ్యూరో : గత ఏడాది వ్యవధిలో రూ.వేల కోట్లు విలువైన డ్రగ్స్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau) స్వాధీనం చేసుకుంది. ఎంతోమంది స్మగ్లర్లను పట్టుకొని కటాకటాల వెనక్కి నెట్టింది. అయినా డ్రగ్స్ సప్లై మాత్రం ఆగడం లేదు. డ్రగ్స్ మాఫియా పలు సముద్ర తీర ప్రాంతాల మీదుగా మనదేశంలోకి ఎడతెరిపి లేకుండా డ్రగ్స్‌ను పంపుతోంది. దీని వెనుక బడా డ్రగ్స్ స్మగ్లర్ హాజీ సలీం(Haji Salim) ఉన్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు అతడి మూలాలను గుర్తించడంపై ఎన్‌సీబీ ఫోకస్ పెట్టింది. ‘ఆపరేషన్ సాగర్ మంథన్’లో భాగంగా హాజీ సలీం ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దావూద్ ఇబ్రహీం ఇంటికి సమీపంలోనే..

ఇరాన్, పాకిస్తాన్‌లోని మారుమూల గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువతను వాడుకొని అతడు డ్రగ్స్‌ను సప్లై చేయిస్తుంటాడని అధికార వర్గాలు అంటున్నాయి. గత ఏడాది వ్యవధిలో భారత్‌లోకి డ్రగ్స్ తీసుకొస్తూ దొరికిపోయిన వాళ్లంతా ఆ రెండు దేశాల వాళ్లేనని గుర్తు చేస్తున్నారు. భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మలేషియాల మీదుగా శ్రీలంక దాకా హాజీ సలీం ముఠా డ్రగ్స్‌ను చేరవేస్తుంటుంది. పాకిస్తాన్‌లోని కరాచీలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇంటికి సమీపంలోనే హాజీ సలీం ఇల్లు కూడా ఉందని అంటున్నారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో కలిసి హాజీ సలీం డ్రగ్స్ సప్లై వ్యవహారాలను నడుపుతుంటాడని చెబుతారు. సముద్ర జలాల్లో అతడి ముఠాలకు అవసరమైన సాయాన్ని పాక్ ఐఎస్ఐ అందిస్తుందనే టాక్ ఉంది. ఐఎస్ఐ అందించే శాటిలైట్ ఫోన్లను హాజీ సలీం వాడుతుంటాడని అంటారు.

Advertisement

Next Story

Most Viewed