KTR : మన ఆడపిల్లలు ఎక్కడైనా క్షేమంగా ఉంటారా? కోల్‌కతా డాక్టర్‌ ఘటనపై కేటీఆర్‌ ట్వీట్

by Ramesh N |
KTR : మన ఆడపిల్లలు ఎక్కడైనా క్షేమంగా ఉంటారా? కోల్‌కతా డాక్టర్‌ ఘటనపై కేటీఆర్‌ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌ రాజధాని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుప్రతిలో ట్రైనీ డాక్టర్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉండగా 31 ఏళ్ల డాక్టర్‌పై ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాచారం, హత్య జరిగినట్లు ఆరోపణలు రావడం దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతి ప్రకటించారు. ఇది భరించాల్సిన అంశం కాదని, మరీ ఇంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారెవరినీ వదిలిపెట్టకూడదని డిమాండ్‌ చేశారు.

మమతా బెనర్జీ ప్రభుత్వం నేరస్తుడిని పట్టుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. దవాఖానలో వైద్యులు సురక్షితంగా ఉండలేకపోతే, మన ఆడపిల్లలు ఎక్కడైనా క్షేమంగా ఉంటారా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. కాగా, పీజీ చదువుతున్న ఆ జూనియర్ వైద్యురాలు ఆగస్టు 8 తేదీన ఆర్‌జీ కార్ ప్రభుత్వాస్పత్రిలో రాత్రి విధుల్లో ఉన్నారు. ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఆమె మర్మాంగాలు, నోరు.. శరీరంపై పలుచోట్ల గాయాలు కనిపించాయి. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనకు సంబంధించిన నిందితుడు సంజయ్‌రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story