KTR: ఐలమ్మ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెట్టింది కేసీఆరే

by Gantepaka Srikanth |
KTR: ఐలమ్మ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెట్టింది కేసీఆరే
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ఆడబిడ్డలకు, మహిళలకు ఆదర్శప్రాయమైన నాయకురాలు వీరనారి చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని గురువారం స్థానిక బీఆర్ఎస్ నాయకులు, జిల్లా రజక సంఘ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో నియంతృత్వాన్ని ఎదిరించి తెలంగాణకు స్ఫూర్తినిచ్చిన అద్భుతమైన వీర వనిత ఐలమ్మ అన్నారు. అలాంటి వీరవనితతో పాటు మహనీయుల జయంతి, వర్ధంతులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా జరపడం మొదలు పెట్టిందని గుర్తు చేశారు.

చిట్యాల ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఐలమ్మ తిరుగుబాటు అందరికీ గుర్తుండేలా జిల్లా కేంద్రంలో బ్రహ్మాండంగా ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి కదిలించిన నాయకురాలు ఐలమ్మ స్ఫూర్తితో భవిష్యత్తులో అందరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed