బ్యాక్‌ ఫైర్‌లో బీఆర్ఎస్.. ఫెయిల్ అవుతున్న కేటీఆర్ వ్యూహాలు

by karthikeya |   ( Updated:2024-10-16 03:09:03.0  )
బ్యాక్‌ ఫైర్‌లో బీఆర్ఎస్.. ఫెయిల్ అవుతున్న కేటీఆర్ వ్యూహాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌కు అన్ని బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ఏ అంశంతో ముందుకు వెళ్దామనుకున్న సక్సెస్ కావడం లేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. అమృత్ స్కీంలో స్కాం ఆరోపణలు.. మూసీ లూటిఫికేషన్ కామెంట్.. హైడ్రా విషయంలో ఆర్డినెన్స్‌తో బ్రేక్.. ఇప్పుడు నేవీ రాడార్ స్టేషన్‌లోనూ చేసిన వ్యాఖ్యలన్నీ రివర్స్ అవుతున్నాయి. అన్నీ గత ప్రభుత్వ నిర్ణయాలేనని ప్రస్తుత సర్కారు క్లారిటీ ఇవ్వడంతో పాటు సీఎం వేదికలపై స్పష్టంగా చెబుతుండటంతో కక్కలేక మింగలేని పరిస్థితి బీఆర్ఎస్‌కు నెలకొంది.

ప్రత్యర్థులకు నోటీసులు పంపే కేటీఆర్‌కూ నోటీసులు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీఆర్ఎస్ భావించింది. ప్రస్తుతం చేసే పనులన్నీ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారని పార్టీ వర్కింగ్ కేటీఆర్ తన విమర్శలతో స్పీడ్ పెంచారు. కానీ ఆయన వ్యూహాలన్నీ బెడిసి కొడుతున్నాయి. ప్రతి అంశం ఫెయిల్ అవుతోందని పార్టీలోనే చర్చకు దారితీసింది. అమృత్ స్కీం టెండర్లలో అవినీతి జరిందని.. ఏకంగా రూ.8,888 కోట్ల స్కాం జరిగిందంటూ కేటీఆర్ ఆరోపించారు. అందులో సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది అయిన సృజన్‌రెడ్డికి సంబంధించిన కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్లు కట్టబెడ్డారంటూ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై సృజన్‌రెడ్డి స్పందించి కేటీఆర్‌కు లీగల్‌ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ నోటీసులో తెలిపారు. తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు.

ప్రతిసారి తనపై ఆరోపణలు చేసే ప్రత్యర్థి పార్టీల లీడర్లకు లీగల్ నోటీసులు పంపే కేటీఆర్‌కు.. సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపించడం ఇప్పుడు పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌‌రెడ్డి కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అమృత్ టెండర్లపై కేటీఆర్‌కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని అభిప్రాయపడ్డారు. సృజన్‌రెడ్డి అనే వ్యక్తి రేవంత్‌రెడ్డికి సొంత బావమరిది కాదని.. తనకు అల్లుడు అవుతారని చెప్పుకొచ్చారు. సృజన్‌రెడ్డికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

మూసీపై సీఎం కౌంటర్ అటాక్‌తో బీఆర్ఎస్‌లో డైలమా

మూసీ ప్రక్షాళనపై కేటీఆర్ తీవ్రవిమర్శలు చేశారు. హామీల‌ను అమ‌లు చేసేందుకు పైస‌లు లేవంట‌.. కానీ మూసీ ప్రక్షాళ‌న కోసం రూ. ల‌క్షా 50 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాడంట‌ అని మండిపడ్డారు. సంక్షేమ పథకాల కోసం పైసలు ఇస్తే మీరు కమీషన్‌లు ఇవ్వరు కదా? అదే మూసీ ప్రాజెక్ట్ అయితే లక్షా కోట్లు మింగొచ్చు అని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ, వాళ్ల బావకు కోట్ల రూపాయలు దోచి పెట్టొచ్చు.. మనం గల్లా పట్టి అడిగే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ మోసం కొనసాగుతూనే ఉంటది. మనం ఏదైనా సమస్య వస్తే కలెక్టర్లకు చెప్పాలంట. ఇంటింటికి ఓట్ల కోసం వచ్చిన వాళ్లను మాత్రం అడగవద్దంట... ప్రజలకు ఏం ఖర్మ. ఎవరైతే మనకు తప్పుడు హామీలు ఇచ్చారో వాళ్లనే పట్టుకోవాలే అని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులను పట్టుకొని మనం అడగాలె అని కేటీఆర్ సూచించారు. మూడ్రోజులపాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లు కోల్పోతున్నవారికి ‘డబుల్’ ఇండ్లు, రూ.25 వేలు, విద్యార్థులకు నాణ్యమైన విద్య కల్పిస్తామనే భరోసా ఇచ్చారు. 2017లో బీఆర్ఎస్ మూసీ సుందరీకరణకు రూపకల్పన చేసిందని దానినే కొనసాగిస్తున్నామని సీఎం వెల్లడించారు. దీంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా డైలమాలో పడింది.

హైడ్రాపై విమర్శలకు ఆర్డినెన్సుతో సర్కారు కౌంటర్

హైడ్రా విషయంలోనూ బీఆర్ఎస్‌కు బ్యాక్ పైర్ అయింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న ఇండ్లను కూల్చివేతకు శ్రీకారం చుట్టింది. అయితే దీనిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ‘మేము నిర్మిస్తే - మీరు కూల్చేస్తున్నారు.. మాది నిర్మాణం - మీది విధ్వంసం.. లక్షల నిర్మాణాలు మావి - లక్షల కూల్చివేతలు మీవి’ అని మండిపడ్డారు. హైడ్రా పేరుతో బుల్డోజర్ రాజ్యం నడుపుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే దీనిపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అధికారాలు సైతం కల్పించింది. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ నగర పరిధిలో నీటి వనరులు, ప్రభుత్వ ఆస్తులు, స్థలాలను కాపాడే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. హైడ్రాకు ప్రత్యేక అధికారాలతో పాటు సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున నియమించడంతో అక్రమ నిర్మాణాలపై మరింత దూకుడును పెంచనుంది. దీంతో కేటీఆర్ ఒకటి తలిస్తే.. మరొకటి అయింది.

ఏ అంశంతో జనంలోకి వెళ్లాలనేదానిపై గులాబీ మల్లగుల్లాలు

ఇప్పుడు నేవీ రాడార్ స్టేషన్‌ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నేవీకి సంబంధించిన వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌ను నిర్మించొద్దని పర్యావరణవేత్తలతో కలిసి పోరాటం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. దామగుండంలో రాడార్ ఏర్పాటు కారణంగా పర్యావరణానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందన్నారు. దాదాపు 2,900 ఎకరాల అటవీ భూభాగంతో పాటు 12 లక్షల చెట్లను నరికి వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టనున్నారన్నారు. జనవాసాలు లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ కేంద్రాన్ని తెలంగాణలో ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ నదిని పూర్తిగా ప్రమాదంలో పడేసే రాడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపటమేమిటనీ ప్రశ్నించారు.

ఇదెక్కడి ద్వంద్వ వైఖరంటూ సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. దీనికి సీఎం ఘాటుగా స్పందించారు. 2017లోనే నేవీ రాడర్ స్టేషన్‌కు భూ బదలాయింపు జరిగిందని, అప్పుడు అంగీకరించి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని.. వివాదాలకు తెరలేపేవారు దేశ రక్షణ, భద్రతపై ఆలోచించాలని సూచించారు. దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితుల నుంచి కాపాడటానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం సరికాదని సూచించారు. కేటీఆర్.. ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ తుస్ మంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఏదీ కలిసి రావడం లేదని, పార్టీ పటిష్టం ఎలా అనేదానిపైనా అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ప్రజల్లోకి ఏ అంశంతో ముందుకెళ్లాలి.. ఎలా వారి మద్దతు పొందాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed