కబ్జా కోరల్లో కొత్త చెరువు.. అయినా అధికారులు సైలెంట్!

by Rajesh |
కబ్జా కోరల్లో కొత్త చెరువు.. అయినా అధికారులు సైలెంట్!
X

దిశ, గండిపేట్ : అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో క‌బ్జాదారులు రెచ్చిపోతున్నారు.. ఎక్కడ గ‌జం స్థలం దొరికినా ఆ స్థలాన్ని ఎప్పుడెప్పుడు క‌బ్జా చేద్దామా..? ఎప్పుడెప్పుడు అమ్మి సొమ్ము చేసుకుందామా..? అనే విధంగా క‌బ్జాదారులు ప్రయ‌త్నాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంట‌లు ఇలా వేటిని వ‌ద‌ల‌కుండా క‌బ్జాలు చేసినా అధికారుల్లో మాత్రం చ‌ల‌నం ఉండ‌టం లేదు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమ‌వుతున్నా ఎలాంటి చ‌ర్యలు తీసుకోక‌పోవ‌డంతో స్థానిక అధికారులు సైతం త‌మ చేతివాటాన్ని చూపుతున్నారు.

రాజేంద్రన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గండిపేట్ మండ‌లం బండ్లగూడ జాగీర్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప‌రిధిలోని గంధంగూడ స‌ర్వే నెంబ‌ర్ 66 లోని కొత్త చెరువు అధికారులు, ప్రజా ప్రతినిధులు, క‌బ్జాదారుల ప‌ని తీరుతో రోజురోజుకు కుచించుకుపోతుంది. ఎప్పటిక‌ప్పుడు చెరువును మ‌ట్టితో నింపుతూ స్థానిక అధికారుల స‌హ‌కారంతో అక్రమాన్ని స‌క్రమం చేసి విక్రయాలు చేస్తున్నారు. 4 ఎక‌రాల 13 గుంట‌ల కొత్త చెరువు ప్రస్తుతం ఎకరం కూడా మిగ‌ల్చలేని ప‌రిస్థితి నెల‌కొంది. కొత్త చెరువును రోజుకు కొంత మ‌ట్టితో నింపుతూ చెరువు మ‌నుగ‌డ‌నే ప్రశ్నార్థకం చేసేశారు. కొత్త చెరువు చ‌రిత్రలో మాత్రమే క‌నిపించే ఓ పేజీలా మార‌నుంద‌ని స్థానికులు తెలుపుతున్నారు.

అయితే కొత్త చెరువు గురించి అధికారుల‌కు తెలియ‌దా అంటే తెలియ‌ద‌నీ కాదు, వారికి తెలిసినా మౌనంగా ఉండ‌ట‌మే గ‌మనార్హం. ఈ కొత్త చెరువు గురించి గ‌తంలోనూ స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఉన్నతాధికారుల‌కు స‌మ‌స్యను వివ‌రించారు. అయినా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. సాధార‌ణంగా పేద‌లు అర‌వై గ‌జాల ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటే వాటికి అనుమ‌తులు లేక‌పోతే వెంట‌నే రంగంలోకి దిగి చ‌ర్యలు తీసుకునే అధికారులు ఒక చెరువు క‌బ్జా అవుతున్నా చూస్తూ ఉండిపోవ‌డం విచిత్రమ‌ని స్థానికులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువును సంర‌క్షించాల‌ని స్థానికులు కోరుతున్నారు.

క‌బ్జాకోరుల‌కు, రెవెన్యూ అధికారుల‌కు మ‌ధ్య స‌త్సంబంధాలు..?

కార్పోరేష‌న్ ప‌రిధిలోని గంధంగూడ స‌ర్వేనెంబ‌ర్ 66 లో చేప‌ట్టిన నిర్మాణాల ప‌ట్ల అధికారుల‌కు తెలిసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. రెవెన్యూ విభాగం అధికారులు చెరువులు, కుంట‌లు కాపాడ‌కుండా క‌బ్జాదారులు చేసేది చూస్తూ ఉండిపోవ‌డం ప‌ట్ల ప్రజ‌లు అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు. క‌బ్జాదారుల‌కు, రెవెన్యూ అధికారుల మ‌ధ్య ఉన్న ఒప్పందాల‌తోనే ఇదంతా జ‌రుగుతుంద‌ని స్థానికులు అంటున్నారు. డ‌బ్బుకో, ఇత‌ర ప్రలాభాలకో అధికారులు లొంగిపోయి చెరువు మ‌నుగ‌డ‌ను ప్రశ్నార్థకం చేయ‌డం స‌రైంది కాద‌ని స్థానికులు హితువు ప‌లుకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రశ్నార్థక‌మ‌వుతున్న కొత్త చెరువును కాపాడాల‌ని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story