- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భద్రాచలం బీఆర్ఎస్ టికెట్ ఎవరికో..?
ఎమ్మెల్యే అభ్యర్థులుగా.. రేసులో ఐదుగురు
పోటీలో ఉంటామని ప్రకటించిన సీపీఎం
సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికార పార్టీ నేతలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం కోసం పాదయాత్రను ప్రారంభించారు. బీఆర్ఎస్ టార్గెట్‌గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరింత దూకుడు పెంచారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అసెంబ్లీ టికెట్ ఆశించే నాయకులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రాచలం బీఆర్ఎస్ టికెట్ కోసం ఐదుగురు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
దిశ, భద్రాచలం: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి పోటీచేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. అలానే జరిగితే.. భద్రాచలం నుంచి ఎక్కువ సార్లు గెలిచిన సీపీఎం పార్టీనే ఆ టికెట్ ఆశించే అవకాశం ఉంది. పొత్తు ఉన్నా, లేకపోయినా భద్రాచలం సీటులో పోటీ చేస్తామని ఇప్పటికే సీపీఎం రాష్ట్ర నాయకులు భద్రాచలంలో ప్రకటించారు. అయినప్పటికీ, టికెట్ కోసం బీఆర్ఎస్ నాయకులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ప్రయత్నాల్లో ముందు వరుసలతో ఉంది బోదెబోయిన బుచ్చయ్య కనిపిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన బుచ్చయ్య జనవరిలో జరిగిన బీఆర్ఎస్ ఖమ్మం బహిరంగసభ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుని ప్రత్యేకంగా కలిసి తనకు భద్రాచలం టికెట్ ఇప్పించమని ప్రాధేయపడినట్లుగా సమాచారం. బుచ్చయ్య తన బంధువు, ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు సపోర్టుతో టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం బోదెబోయిన బుచ్చయ్యకి మంత్రులు హరీష్‌రావు, అజయ్‌కుమార్‌లు సైతం భరోసా కల్పించినట్లు వినికిడి. ఈ క్రమంలో భద్రాచలం టికెట్ ఈసారి బోదెబోయిన బుచ్చయ్యకే ఖచ్చితంగా వస్తుందని ఆయన అనుచరులు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త పొలిటికల్ సర్కిల్‌లో బాగా ప్రచారం జరుగుతున్నా.. మరో వైపు పొత్తులో భాగంగా బుచ్చయ్య టికెట్ ఆశలు ఫలిస్తాయా అనేది అనుమానంగా ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి తెల్లం వెంకట్రావు ఈసారి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడుగా ముద్ర పడిన తెల్లం వెంకట్రావుకి బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్న ఆయన ప్రస్తుతం రాజకీయాలు ప్రక్కనబెట్టి విశ్రాంతి తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ టికెట్ రేసులో తుమ్మల వర్గీయుడు, తెలంగాణ ఉద్యమకారుడు, 2014లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మానె రామకృష్ట పేరు సైతం వినిపిస్తోంది. మరో ఇంజనీర్ పేరు కూడా వినిపిస్తున్నా పొత్తుల విషయం ఆలోసించి కాస్త వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశించే సదరు ఉద్యోగి న్యూ ఇయర్ సమయంలో తన ఫొటో పబ్లిసిటీ చేస్తూ శుభాకాంక్షల ప్లెక్సీలు విస్తృతంగా పెట్టి హడావుడి చేశారు. ఒక దశలో టికెట్ ఆయనకే అన్నంత ప్రచారం కూడా జరిగింది.
పోటీకి సై అంటున్న సీపీఎం..
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా భద్రాచలం నుంచి సీపీఎం అభ్యర్థి పోటీలో ఉంటారని ఆ పార్టీ నాయకత్వం ఇటీవలే ప్రకటించింది. అందుకు అనుగుణంగా క్యాడర్‌ని కూడా ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తోంది. త్వరలోనే అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ బలపడకుండా కట్టడి చేయడం కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకొని పోటీ చేస్తాయని బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు భావిస్తున్నారు. సీపీఎం ప్రకటన పొత్తులకు విఘాతం కలిగించే తొందర పాటు నిర్ణయంగా ఉందని బీఆర్ఎస్ శ్రేణులు వాపోతున్నారు. పొత్తు కుదిరితే కంచు కోట లాంటి భద్రాచలం సీటు తమకే దక్కుతుందని సీపీఎం ఆశిస్తోంది. అదే జరిగితే భద్రాచలంలో ఈ సారైనా గులాబీ జెండా ఎగరేయాలనే బీఆర్ఎస్ శ్రేణుల ఆశలు ఆవిరైనట్లే. కాంగ్రెస్ పార్టీ నుంచి భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య బరిలోకి దిగనున్నారు. బీఎస్పీ అభ్యర్థి అనుకున్న ఎన్. కృష్ణార్జునరావు హఠాన్మరణం చెందడంతో మరో అభ్యర్థి కోసం ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ వేట మొదలు పెట్టారు. ఇక రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ గత ఎన్నికల్లో పోటీ పెట్టిన మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతిని బరిలో నిలుపుతుందా లేక అభ్యర్థిని మార్చుతారా అనేది తెలియాల్సి ఉంది. టీడీపీ, వైఎస్‌ఆర్‌టీపీ అభ్యర్థులతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు ఈ సారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆశ నిరాశల నడుమ భద్రాచలం టికెట్ కోసం చాలామంది గిరిజన నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈసారి పోటీ చేయాలని తహతహలాడుతున్న వారికి ఇతర పార్టీలు కూడా గాలం వేస్తున్నాయి. టికెట్ రాకపోతే చివరి నిమిషంలో మరో పార్టీలోకి జంప్ అయ్యేందుకు ముఖ్య నేతలు బెర్త్‌లు సిద్ధం చేసుకుంటున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఆశావహులు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి భద్రాచలంలో పోటీ జనరల్ స్థానం మాదిరిగా రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Read more: