డిప్యూటేషన్‌పై ఆమెను ఖమ్మం పంపిస్తాం : వరంగల్ రీజినల్ డైరెక్టర్

by Aamani |
డిప్యూటేషన్‌పై ఆమెను ఖమ్మం పంపిస్తాం : వరంగల్ రీజినల్ డైరెక్టర్
X

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ లో ఉన్న జూనియర్ అకౌంటెంట్ ఆశా కుమారిని ఖమ్మం కార్పొరేషన్ కు డిప్యూటేషన్ పై పంపిస్తామని వరంగల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ రీజినల్ డైరెక్టర్ సాహిద్ మసూద్ స్పష్టం చేశారు. డెఫ్ అండ్ డం తో బాధపడుతున్న ఆశ కుమారిని మానవీయ కోణంలో ఖమ్మంకు డిప్యూటేషన్ చేస్తున్నామని వివరించారు. మంగళవారం మధ్యాహ్నం దిశ వెబ్సైట్ లో "వైరా మున్సిపాలిటీలో డెఫ్ అండ్ డం మహిళకు ఘోర అవమానం" అనే వార్తా కథనం ప్రచురితమైంది. అయితే మంగళవారం సాయంత్రం వైరా మున్సిపాలిటీని రీజినల్ డైరెక్టర్ మసూద్ సందర్శించి ఇంటి పన్నుల వసూళ్ల పై సమావేశం నిర్వహించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కొంతమంది విలేకరులు 8 నెలలుగా ఆశా కుమారికి మున్సిపాలిటీలో ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పని విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ విషయంలో దిశ వెబ్సైట్ లో వచ్చిన కథనంను ఆయనకు వివరించారు. దీంతో వెంటనే స్పందించిన రీజినల్ డైరెక్టర్ ఆశా కుమారిని కమిషనర్ ఛాంబర్ లోకి రీజినల్ డైరెక్టర్ పిలిపించి మాట్లాడారు. మానవీయ కోణంలో ఆమెను ఖమ్మం కార్పొరేషన్ కు డిప్యూటేషన్ పై పంపుతామని స్పష్టం చేశారు. విలేకరుల సమక్షంలోనే ఆమెను ఖమ్మం కార్పొరేషన్ కు డిప్యూటేషన్ పై పంపేందుకు తనకు దరఖాస్తు చేసుకోవాలని ఆశ కుమారికి సూచించారు.

అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న మరో జూనియర్ అకౌంటెంట్ కు బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. వైరా పట్టణంలో గత నెల రోజుల క్రితం మున్సిపాలిటీ అధికారులు అక్రమణ తొలగింపులో ద్వంద నీతిని ప్రదర్శించిన విషయాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఆక్రమణల తొలగింపు తమ పరిధి కాదని టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణల వ్యవహారాన్ని చూసుకోవాలని రీజినల్ డైరెక్టర్ పేర్కొన్నారు. చిరు వ్యాపారుల తోపుడుబండ్లను జెసీబీ లతో తొలగించిన అధికారులు శాశ్వత నిర్మాణాల గురించి పట్టించుకోవడం లేదని ఆయన దృష్టికి తీసుకు వెళ్ళగా సమాధానాన్ని దాటవేశారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపాలిటీ కమిషనర్ చింతా వేణు, ఆర్ ఐ ప్రదీప్ పాల్గొన్నారు.

Next Story