ITDA Project Officer : గిరిజన రైతులు ప్రకృతి వ్యవసాయంతో ఇతర పంటలు పండించాలి..

by Sumithra |
ITDA Project Officer : గిరిజన రైతులు ప్రకృతి వ్యవసాయంతో ఇతర పంటలు పండించాలి..
X

దిశ, భద్రాచలం : గిరిజన రైతులు ప్రకృతి వ్యవసాయంతో వరి పంటలే కాకుండా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందడానికి ఆయిల్ ఫామ్, వేరుశనగ పంటలు, ఉద్యానవనం సంబంధించిన పంటలు పండించి జీవనోపాధి పెంపొందించుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి. బి రాహుల్ అన్నారు. శుక్రవారం నాడు దుమ్ముగూడెం మండలంలోని ఎన్.లక్ష్మీపురం గ్రామంలో గిరిజన రైతులు ప్రకృతి వ్యవసాయ పథకం అమలుతీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గిరిజన రైతులకు పలు సూచనలు ఇస్తూ రైతు ఉత్పత్తి సంఘం పరిధిలో గిరిజన రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించుకుంటే భూసారం కూడా శక్తిని కోల్పోదని అన్నారు.

అనంతరం గోశాలను పరిశీలించి పల్లెప్రాంతాల్లో ఎక్కువ శాతం గోవులను పెంచుతారని, గోవుల వలన పేడ, జీవామృతం, ఘనామృతం తయారు చేసుకొని పంటలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చని, ప్రకృతి వ్యవసాయంతో అధిక లాభాలు గడుస్తున్న గిరిజన రైతు ఎర్రం సత్తిబాబును ఆయన అభినందించారు. అనంతరం రైతులకు సంబంధించిన చేపల చెరువును పరిశీలించి ప్రమాదకరమైన వ్యర్ధాలను వేసి చేపల పెంపకం చేయకూడదని, ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని చేపలకి వేసి చేపల ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం గిరిజన రైతుల పంట పొలాలకు నీరు సరఫరా చేయడానికి త్రీఫేస్ లైన్ కరెంటు సౌకర్యమును పరిశీలించగా, ఐటీడీఏ ద్వారా గిరిజన రైతులను గుర్తించి త్రీఫేస్ సౌకర్యం కల్పించడం వలన మా పంట పొలాలకు సులభంగా నీటి సరఫరా వేసి పంటలు పండించుకుంటున్నామని, పంట పొలాలకు నీటి సమస్య లేదని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.

గోదావరి వరదల వలన సింగారం బ్రిడ్జి కూలిపోవడం వలన ఎన్.లక్ష్మీపురం గ్రామానికి వెళ్లడానికి గిరిజనులకు రహదారి సౌకర్యం లేదని బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, బ్రిడ్జి నిర్మాణం వలన ఉపాధ్యాయులకు కానీ, గిరిజన రైతులకు కానీ, పాఠశాలలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు, ఆసుపత్రులకు వెళ్లడానికి మంచి సౌకర్యంగా ఉంటుందని గిరిజనులు పీఓ దృష్టికి తీసుకురాగా త్వరలో పూర్తి చేస్తామని ఆయన అన్నారు. అనంతరం జీపీఎస్ పాఠశాలను సందర్శించి పిల్లల నైపుణ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గిరిజనులు పంట పొలాల్లో వేసే వరి నాట్ల పనితీరును, జీవామృతం తయారు చేసే ఫారంను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడి భాస్కర్, ఉద్యానవన అధికారి/ ఏటీడీఓ అశోక్ గిరిజన రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed