Collector : విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు ఉండాలి

by Sridhar Babu |   ( Updated:2024-11-01 11:37:24.0  )
Collector : విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు ఉండాలి
X

దిశ బ్యూరో, ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఆంగ్ల పరిజ్ఞానం అందేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ (Collector Muzammil Khan)అన్నారు. శుక్రవారం మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఆంగ్ల పాఠ్యాంశం బోధిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తరగతి గదిలో విద్యార్థినులతో కలిసి కూర్చొని పరిశీలించారు. ఆంగ్ల భాష పట్ల భయం అవసరం లేదని, ప్రతిరోజూ ఒకరికొకరు కొంత సేపు ఆంగ్లంలో మాట్లాడుకుంటే భాషను సులువుగా నేర్చుకోవచ్చని అన్నారు. కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారిని ఆంగ్లంలో మాట్లాడించి చైతన్య పరిచారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై బోధన ప్రమాణాలు, పాఠశాల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (Collector) మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్లం సులువుగా అర్ధం చేసుకొని మాట్లాడే విధంగా యూ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లిష్ కార్యక్రమాన్ని మన ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారు సైతం ఆంగ్ల పదాలు సరిగ్గా ఉచ్ఛరించి మాట్లాడే విధంగా బోధించాలని సూచించారు. పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులు మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు గుర్తించామని, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేదని పాఠశాల హెడ్ మాస్టర్ (School Head Master)కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు. మత్తుకు బానిసైనా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మన పిల్లలుగా భావించి ఓపికతో బాగు చేయాలని, నష్టాలను వివరించాలని కోరారు. క్రీడలు, చదువులో వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఏఎంఓ రవి, పాఠశాల హెచ్ఎం లక్ష్మీ, ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story