Udan yatri cafe: ఎయిర్‌పోర్టులో కేఫ్ ధరలకు చెక్? ఉడాన్ యాత్రి కేఫ్ ప్రారంభించిన కేంద్రం

by vinod kumar |
Udan yatri cafe: ఎయిర్‌పోర్టులో కేఫ్ ధరలకు చెక్? ఉడాన్ యాత్రి కేఫ్ ప్రారంభించిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: విమానాశ్రయాలలో అధిక ధరలకు టీ, కాఫీ, ఇతర ఆహారపదార్థాలు విక్రయించడంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఉడాన్ యాత్రి కేఫ్’ (Udaan yatri cafe) కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోల్‌కతా(Kolkata)లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సహకారంతో ప్రారంభించిన ఈ కేఫ్‌లో తక్కువ ధరలకే ప్రయాణికులకు ఆహార పదార్థాలతో పాటు ఇతర పానీయాలు అందుబాటులో ఉండనున్నాయి. దీనిలో వాటర్ బాటిల్స్ రూ. 10, టీ రూ.10, కాఫీ రూ.20. సమోసాలు, రోజువారీ స్వీట్స్ వంటి స్నాక్స్ ధర కూడా రూ.20లోపే ఉండనున్నట్టు తెలుస్తోంది.

‘ఉడాన్ యాత్రి కేఫ్ కేవలం ఆహారానికి సంబంధించిన షాప్ మాత్రమే కాదు. తక్కువ ధర కలిగిన చిరుతిండితో వియాన ప్రయాణాన్ని సుసంపన్నం చేసేలా చేయడమే మా లక్ష్యం’ అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తక్కువ ధరలలో ప్రయాణికులకు నీరు, టీ, కాఫీ, స్నాక్స్ అందించడమే ఈ కేఫ్ ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ఈ కార్యక్రమం విజయవంతమైతే దీనిని ఇతర విమానాశ్రయాలకు విస్తరించేందుకు ఏఏఐ ప్రణాళికలు రచిస్తోంది. కాగా, విమాన ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం చర్యలు చేపట్టడం గమనార్హం.

హ్యాండ్ బ్యాగ్ లగేజీ కోసం కొత్త రూల్స్!

విమానాల్లో హ్యాండ్ బ్యాగ్ లగేజీ కోసం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) కొత్త నిబంధనలు రూపొందించినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం.. ప్రయాణికులకు విమానం లోపల ఒక హ్యాండ్ బ్యాగ్‌ని మాత్రమే అనుమతించనున్నారు. అది కూడా ఏడు కేజీల కంటే ఎక్కువగా ఉండకూడదు. అయితే, మొదటి లేదా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారికి మాత్రం 10 కిలోల వరకు ఉంటుంది. అలాగే బ్యాగు కొలతలు ఎత్తు 55 సెం.మీ (21.6 అంగుళాలు), పొడవు 40 సెం.మీ (15.7 అంగుళాలు), వెడల్పు 20 సెం.మీ (7.8 అంగుళాలు) మించొద్దని పలు విమానయాన సంస్థలు షరతులు విధించే యోచనలో ఉన్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed