అందాల పాకాల.. అభివృద్ధి దిశగా అడుగులు..

by Sumithra |
అందాల పాకాల.. అభివృద్ధి దిశగా అడుగులు..
X

దిశ, ఖానాపురం : తెలంగాణ పర్యాటక రంగంలో పాకాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చూపరులను కనువిందు చేసే అందాలకు నిలయమైన పాకాలను వీక్షించి పర్యాటకులు మంత్రముగ్ధులు కావాల్సిందే. ఇంతటి ప్రశస్తి కలిగిన పాకాల సరస్సు, అభయారణ్యం టూరిజం హబ్ గా మారడానికి అన్ని సొబగులను సంతరించుకుంటుంది. ప్రభుత్వ కదలికతో ప్రజాప్రతినిధుల చొరవతో ఈ ప్రాంతం అభివృద్ధికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. పర్యాటకుల తాకిడి ఎక్కువ ఉండే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇటీవల అటవీశాఖ అధికారులు, పర్యాటక శాఖ సమన్వయంతో అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టారు. వరంగల్ జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతమైన పాకాల సరస్సు నర్సంపేట పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది.

వరంగల్ నగరానికి 50 కిలోమీటర్ల, రాజధానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాకాలకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తారు. సెలవు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. సరస్సు మధ్యలో ఉండే చిలకలగుట్ట, మత్తడి ప్రదేశం, తుంగబంధం తూము నుంచి పాకాల అందాలను వీక్షిస్తూ ప్రకృతిలో లీనమై ప్రత్యేకానుభూతి పొందుతారు. పాకాల సరస్సు అందాలే కాదు అభయారణ్యంలో వివిధ రకాల జంతువులు విదేశీ, స్వదేశీ పక్షులకు నిలయంగా జీవ వైవిధ్య వాతావరణం నెలకొంది. పర్యాటకులు కట్ట మీద రామక్కను దర్శించి మొక్కులు చెల్లిస్తారు. దర్శనీయ ప్రదేశంగా ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న ప్రభుత్వం ఇటీవలే రూ.50 లక్షల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టింది.

త్వరలో పాకాల బోటింగ్ షురూ..

పాకాలను అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ రూ.50 లక్షల నిధులు విడుదల చేశారు. ఈ నిధులతో బోటింగ్ పాయింట్ వద్ద సాగర తోరణంతో పాటు పలు అభివృద్ధి పనులను అధికారులు చేపట్టారు. త్వరిత గతిన పనులను పూర్తి చేసి పర్యాటకులకు బోటింగ్ అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పనులను ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులు పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బోట్లతో పాటు నూతనంగా మరి కొన్ని బోట్లను ఏర్పాటు చేసి, వాటర్ సైకిల్, జార్బింగ్ ,వాటర్ రోలింగ్, కట్టపైన బీటీ రోడ్డు నిర్మాణం, బటర్​ఫ్లై గార్డెన్ ఆధునికీకరణ , వ్యూ పాయింట్ ఏర్పాటు, మూడు రిసార్ట్స్, బ్యాటరీ వాహనాలు, బండ్ ప్లాంటింగ్ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనులన్నీ మార్చి 2025 లోగా పూర్తి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రెస్టారెంట్ పునరుద్ధరణ..

పాకాల వద్ద హరిత రెస్టారెంట్లను మరింత అభివృద్ధి పరిచి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఆహారం, నీరు, విద్యుత్ సౌకర్యం, వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తే పర్యాటకం మరింతగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా నైట్ క్యాంపులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఐదు నైట్ క్యాంపు టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో నైట్ క్యాంపు ఏర్పాటు చేసినప్పటికీ పర్యాటకులకు అందుబాటులో లేదు. నైట్ కాంపింగ్ సౌకర్యం యువతను ఆకర్షిస్తుందని అటవీ పర్యాటక శాఖ ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది.

పాకాల ఆధునీకరణ దిశగా..

పాకాల ఆధునీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే గూడూరు రేంజ్ పరిధిలో పాకాల అభయారణ్యం అభివృద్ధి కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పాకాల అటవీ ప్రాంతంలో అనేక జీవ జాతుల మొక్కలు, జంతు, పక్షులు ఉంటాయి. ఈ అడవుల్లో వేల రకాల వృక్ష జంతు జాతులు, సరస్సులో సరీసృపాలు, చేపలు, మొసళ్లు కనిపిస్తాయి. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా ఈ సరస్సు ప్రాంతాన్ని పార్కులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే బయోడైవర్సిటీ పార్కు, మూలిక మొక్కల పార్కు, బట్టర్ ఫ్లై పార్కు ఉండగా జంతు ప్రదర్శన శాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. నూతనంగా నాలుగు రిసార్టులు ఏర్పాటు చేస్తారు. ట్రెక్కింగ్ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. లక్నవరం మాదిరి వేలాడే వంతెనలు స్కైవే ఏర్పాటు చేస్తే వరంగల్ జిల్లాకే తలమానికంగా ఈ ప్రాంతం నిలుస్తుంది. చిల్డ్రన్ పార్కులో నూతనంగా మరిన్ని ఆట వస్తువులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేయడంతో పర్యావరణ పరిరక్షణతో పాటు వృద్ధులు, పిల్లలు ప్రయాస పడకుండా సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో ఇప్పటికే నిధులు విడుదలైన నేపథ్యంలో ప్రభుత్వ సహకారం ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయించి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా పాకాలను తీర్చి దిద్దే దిశగా చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు.

Advertisement

Next Story