సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం అసమాన్యమైంది

by Sridhar Babu |
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం అసమాన్యమైంది
X

దిశ, కొత్తగూడెం : బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరం లో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. ఆయనతో పాటు అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ పాల్గొని పాపన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి అనుసరణీయమని పేర్కొన్నారు. మహనీయుల త్యాగ నిరతి నేటి తరాల వారు తెలుసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.

అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ పోరాట తెగువ అసామాన్యమైనదని కొనియాడారు. మొఘల్ రాజుల కాలంలో దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన ధీశాలి సర్వాయి పాపన్న అన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని, ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కాటమయ్య రక్ష పథకం ద్వారా గౌడ కులస్తులకు రక్షణ కిట్స్ అందించడం, శిక్షణ కార్యక్రమం అధికారులు చేపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి ఇందిర, జిల్లా పరిపాలన అధికారి గన్యా, బండి రాజుగౌడ్, అందెం గంగరాజు, కె. గౌతమ్, ఆబ్కారి శాఖ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ. జె. రమేష్, ఆబ్కారి శాఖ ఎస్ఐ పాసిని వెంకన్నగౌడ్ , బి. రవి గౌడ్, ఇజ్జగాని రవి గౌడ్ , కొదుమురి సత్యనారాయణ ,బొర్రా జయమ్మ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed