IGP Chandrasekhar Reddy : గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో జిల్లా పోలీసుల పనితీరు భేష్

by Aamani |
IGP Chandrasekhar Reddy : గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో జిల్లా పోలీసుల పనితీరు భేష్
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం: శుక్రవారం హేమచంద్ర పురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు అధికారులతో మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ముందుగా సమావేశానికి విచ్చేసిన ఐజీపీ కి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్వాగతం పలికారు.అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల పనితీరును,నిషేధిత మావోయిస్టు కదలికల పట్ల ప్రస్తుత స్థితిగతులను ఎస్పీ వివరించారు.ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ,వారి కదలికలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నిషేధిత మావోయిస్టులు ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడకుండా వారిని నివారించాలని తెలిపారు.శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడంలో జిల్లా పోలీసుల పనితీరు ప్రశంసనీయమని,అంతే ఉత్సాహంతో పనిచేయాలని అన్నారు.

జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,5S అమల్లో భాగంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను,ఫైళ్లను ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో పరిధిలోని ప్రతీ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అప్రమత్తం చేయాలని తెలియజేసారు.అనంతరం హెడ్క్వార్టర్స్ ప్రాంగణంలో ఐజీ, ఎస్పీ రోహిత్ రాజు మొక్కలు నాటారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ పరితోష పంకజ్ ఐపిఎస్,భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్ ఐపీఎస్,ఇల్లందు డీఎస్పీ చంద్రభాను,పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,డీసీఆర్బి డీఎస్పీ మల్లయ్య స్వామి,ఏవో జయరాజు సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story