మట్టిలో మాణిక్యాలు.. ఒక్కొక్కరికి రెండు, మూడు ఉద్యోగాలు..

by Sumithra |
మట్టిలో మాణిక్యాలు.. ఒక్కొక్కరికి రెండు, మూడు ఉద్యోగాలు..
X

దిశ, కొత్తగూడెం : ప్రతిభ ఎవరి సొత్తు కాదని, ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపిస్తున్నారు. డీఎస్సీ - 2024లో ఎంపికై ఉద్యోగం చేస్తున్న నూతన ప్రభుత్వ ఉపాధ్యాయులు. సకల సౌకర్యాలు ఉండి, అన్ని వసతులు ఉన్నాగాని తమకు ఏదో తక్కువ అయినట్లు బాధపడే పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఉపాధ్యాయులు. అత్యంత పేదరికం నుంచి వచ్చి, చదువుకునేందుకు అష్ట కష్టాలు పడి, ఏకంగా ఓకే డీఎస్సీలో ఒక్కొక్కరు రెండు, మూడు ఉద్యోగాలు సాధించి తమకు తామే పోటీ గా నిలుస్తున్నారు ఈ టీచర్లు.

ఆటో డ్రైవర్ కూతురికి రెండు ఉద్యోగాలు..

ఇల్లందు మండలం రేపల్లె వాడకు చెందిన ఆటో డ్రైవర్ లావుడియా తులసియా కూతురు లావుడియా మంజుల డీఎస్సీ 2024లో ఏకంగా పీఈటీ, పీడీ రెండు ఉద్యోగాలు సాధించారు. రెండు ఉద్యోగాల్లోను మంజుల జిల్లా మొదటి ర్యాంకు సాధించి ముందంజలో నిలిచారు. తండ్రి ఒక ఆటో డ్రైవర్ అయినా, పేదరికంతో అష్ట కష్టాలు పడుతూ, తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తూ, చదువు అంతా ప్రభుత్వ విద్యాసంస్థలలోనే పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది మంజుల. ప్రస్తుతం కొత్తగూడెం మేదర బస్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంజుల ఫిజికల్ డైరెక్టర్ గా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు. తన ఇద్దరు అక్కలు, తన తండ్రి ప్రోత్సాహంతోనే తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించాను అంటున్నారు మంజుల. ఆన్లైన్ తరగతులు వింటూ సొంతగా ప్రిపేరై పరీక్ష రాసి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది మంజుల. పేదరికంలో కూడా తన తండ్రి తులసియా తన చదువు కోసం ప్రతి రూపాయి పోగు చేసి తనను చదివించారని, ఆయన స్ఫూర్తితోనే పట్టుదలతో ఉద్యోగం సాధించానని మంజుల చెప్పుకొచ్చారు.

పండ్లమ్ముకునే వ్యక్తి కొడుకుకు మూడు ఉద్యోగాలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మోదులగూడెం గ్రామానికి చెందిన ముత్తారావు వీధుల్లో సైకిల్ పై తిరుగుతూ పండ్లు అమ్ముకొని జీవనం కొనసాగించేవాడు. ఆయన కొడుకు హరికిరణ్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ -2024 ఉద్యోగ ఫలితాల్లో ఏకంగా మూడు ఉద్యోగాలు సాధించి తనకు తానే పోటీ అని నిరూపించాడు. తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ, కొబ్బరి బోండాలు అమ్మడం, తండ్రితో పాటు తిరిగి పండ్లు అమ్ముకుంటూనే, డీఎస్సీకి ప్రిపేర్ అయి పరీక్ష రాశాడు హరికిరణ్. విద్యాభ్యాసమంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఎటువంటి కోచింగ్ లేకుండా తానే సొంతంగా ప్రిపేర్ అయ్యి మూడు ఉద్యోగాలు సాధించాడు. జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ లో జిల్లా మొదటి ర్యాంకు , స్కూల్ అసిస్టెంట్ గణితంలో జిల్లా రెండో ర్యాంకు, హైదరాబాదులో నాన్ లోకల్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ లో జిల్లా టాపర్గా నిలిచాడు. ప్రస్తుతం చుంచుపల్లి మండలంలోని చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. చిన్నతనం నుండి తన తండ్రి పడ్డ కష్టాన్ని చూసి చలించి, ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని పట్టుదలతో కష్టపడి చదివానంటున్నాడు హరి కిరణ్.

Advertisement

Next Story

Most Viewed