3 కోట్ల వ్యయంతో నిర్మాణం.. మూడు రోజులకే పగుళ్లు

by Mahesh |
3 కోట్ల వ్యయంతో నిర్మాణం.. మూడు రోజులకే పగుళ్లు
X

దిశ, చర్ల: చర్ల మండల కేంద్రం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పూసుగుప్ప వరకు 30 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించింది. ఈ విషయమై దిశలో ‘రోడ్డుపై రోడ్డు పట్టించుకునేదెవరు’ అనే శీర్షికతో కథనం ప్రచురించింది. రోడ్డు నిర్మాణంలో పాటించాల్సిన నిబంధనలు పాటించడం లేదని కథనంలో పేర్కొంది. సీసీ రోడ్డు వేసిన మూడు రోజులకే పగుళ్లు రావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పూజారి గూడెం వరకు ఒక కిలో మీటర్ మేరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం మొదలు పెట్టిన సదరు గుత్తేదారు పూజారి గూడెం నుంచి శివాలయం వరకు పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం వేసిన ఆ రోడ్డంతా కొన్ని చోట్ల రోడ్డుకు అడ్డంగా పగిలిపోయింది. మొత్తం ఐదు చోట్ల రోడ్డు పగిలి అధ్వాన్నంగా తయారైంది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు ఏం పనులంటూ సదరు గుత్తేదారుడిని ప్రశ్నించినా స్పందన కరువైందని వాపోతున్నారు.

రోడ్డు వేసిన మూడు రోజులకే పగిలిపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. చర్ల నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి అత్యధిక మంది ప్రజలు ఈ మార్గం ద్వారానే వెళుతుంటారని, రెండు రాష్ట్రాల ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డు నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అభివృద్ధి పనుల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొందరు అధికారులు గుత్తేదారులకు జేబులు నింపుతున్నారని, అందులో భాగంగానే ఇలాంటి నాణ్యతలేని పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, గుత్తేదారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై రోడ్ల భవనాల శాఖకు చెందిన ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.

మూడు రోజుల్లోనే బీటలు

వేసిన మూడు రోజులకే సిమెంట్ రోడ్డు ఐదు చోట్ల పగిలిపోయింది. రోడ్డంతా బీటలు వారుతుంది. రోడ్డు కాంట్రాక్టర్‌ను ఇదేంటని ప్రశ్నించినా ఎటువంటి స్పందన లేదు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే వారు రావడం లేదు. రోడ్డు నిర్మాణ పనుల వద్ద కింది స్థాయి సిబ్బందిని ఉంచి నామమాత్రపు పర్యవేక్షణ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, గుత్తేదారుడిపై చర్యలు తీసుకోవాలి.:-ఆలం బ్రహ్మనాయుడు, పూజారి గూడెం

కిందిస్థాయి సిబ్బందితోనే పర్యవేక్షణ

రూ.3.30కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనులను ఇంజినీరింగ్ అధికారులు విస్మరించారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు పనుల వద్ద కింది స్థాయి సిబ్బందిని ఉండటం ఏంటి? మూడు రోజులకే రోడ్డు అడ్డంగా పగిలిపోయింది. కారణం ఏంటి? దీనికి అధికారులు సమాధానం చెప్పాలి. ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలి.- ముసలి సతీశ్, న్యూడెమోక్రసీ

Advertisement

Next Story

Most Viewed