అవకతవకలపై విచారణ జరపాలని మంత్రికి వినతి...

by Naveena |
అవకతవకలపై విచారణ జరపాలని మంత్రికి వినతి...
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయంలో పనిచేస్తున్న జిల్లా అధికారితో పాటు పలువురు సిబ్బంది ఉద్యోగ నియామకాల్లో భారీగా అవకతవకలకు పాల్పడుతున్నారని, గత కొన్ని నెలలుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి..ఉద్యోగం నుంచి తొలగించాలని కోరారు. ఉపాధి శాఖ కార్యాలయ అధికారి మధ్యవర్తులను పెట్టుకొని ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. గత ఐదు నెలల క్రితం ఏజెన్సీల కేటాయింపుల్లో ఏజెన్సీల ద్వారా వస్తు రూపేణా, ఆభరణాల రూపేణా నగదు రుపేణా భారీగా వసూలు చేస్తున్నారని, దానిపై పలు ఏజెన్సీల నిర్వహకులే చర్చించడంతో పాటు..పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో ఉన్నతాధికారులను తాను మేనేజ్ చేసుకున్నానని, మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పలు ఏజెన్సీలకు జిల్లా ఉపాధి శాఖ అధికారి చెప్పినట్లు నిర్వాహకులు తమ దృష్టి తీసుకువచ్చారన్నారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్ ఉద్యోగ నోటిఫికేషన్ నేరుగా వేసి పారదర్శకంగా భర్తీ చేద్దామని ఆలోచన చేశారని పలు పత్రికలలో వచ్చిన కథనాలు చదివామన్నారు. దానిపైన తాము పూర్తిస్థాయిలో పలు అంశాలను తెలుసుకునేందుకు పరిశీలించగా..గత నోటిఫికేషన్ లో 32 ఉద్యోగాలు నింపగా ఉపాధి శాఖ కార్యాలయ అధికారి, గతంలో అదనపు కలెక్టర్ వద్ద సి.సి గా పనిచేసిన వ్యక్తి ద్వారా డబ్బులు వసూలు చేయించి పలువురికి ఉద్యోగాలు వచ్చేలా చేశాడన్నారు. ప్రస్తుతం సైతం 50 ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి మెరిట్ లో ఉన్న పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని మధ్యవర్తిత్వం వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఉపాధి శాఖ కార్యాలయంలో ఏజెన్సీల కేటాయింపులో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు అరుణ్ కుమార్, పీ డీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు సురేష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజ, వినోద్, శ్యామ్, ప్రవీణ్, శ్రీధర్,శ్రవణ్, అభిలాశ్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story