Rona Wilson: ఎల్గార్ పరిషత్ కేసులో రోనా విల్సన్‌కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు

by vinod kumar |
Rona Wilson: ఎల్గార్ పరిషత్ కేసులో రోనా విల్సన్‌కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎల్గార్ పరిషత్ కేసు (Elgar Parishad case) లో రీసెర్చ్ స్కాలర్ రోనా విల్సన్ (Rona Wilson), సామాజిక కార్యకర్త సుధీర్ ధావలే (Sudeer dhawle)లకు బాంబే హైకోర్టు (Bombay high court) బుధవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఏఎస్ గడ్కరీ, జస్టిస్ కమల్ ఖాటాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ కాలం జైలులో ఉండటం, ఇప్పటి వరకు అభియోగాలను రూపొందించకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న బెంచ్ రూ.లక్ష పూచీ కత్తుతో ఇద్దరికీ బెయిల్ ఇచ్చింది. అలాగే విచారణ జరుగుతున్నందున క్రమం తప్పకుండా ప్రతీ సోమవారం ఎన్ఐఏ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో 300 మందికి పైగా సాక్షులున్నారని, కాబట్టి దర్యాప్తు త్వరగా ముగించడం సాధ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. బీమా కోరేగావ్ అల్లర్ల అనంతరం 2018లో రోనా విల్సన్, సుధీర్ ధావలేలను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వారు జైలులోనే ఉండగా తాజాగా వారికి బెయిల్ లభించింది.

కాగా, భీమా కోరేగావ్ యుద్ధం జరిగి రెండు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని పూణెలో 2017 డిసెంబర్ 31న ఎల్గార్ పరిషత్ సమ్మేళనం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం జరిగిన మరసటి రోజు పూణె జిల్లాలోని బీమా కోరెగావ్‌లో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరికొందరికి గాయాలయ్యాయి. దీంతో ఈ సమావేశానికి మావోయిస్టులతో సంబంధాలున్నాయని, మీటింగ్‌లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని పోలీసులు ఆరోపించారు. ఈ క్రమంలోనే 16 మందిపై కేసు నమోదు చేసి వారందరినీ అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed