ఉర్సుకు ముస్తాబవుతున్న జేపీ దర్గా..

by Aamani |
ఉర్సుకు ముస్తాబవుతున్న జేపీ దర్గా..
X

దిశ,కొత్తూర్ : వందల ఏండ్ల చరిత్ర ...మతసామరస్యానికి ప్రతీక. తెలంగాణ ప్రజలే కాక పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున వేలకొద్ది భక్తులు దర్గాకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన దర్గాగా.. మత సామరస్యానికి చిహ్నంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ములనర్వ గ్రామం పరిధిలో ఉన్న జేపీ దర్గాను చెప్పుకుంటారు. రాష్ట్ర రాజదానికి అతి సమీపంలో ఉన్న ఈ దర్గా ముస్లింల పవిత్రస్థలమైనప్పటికీ హిందువులే అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. అందుకేమో ఈ దర్గాను మతసామరస్యానికి ప్రతీకగా భావిస్తారు. జనవరి వచ్చిందంటే చాలు షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట వ్యాప్తంగా ఉన్న ముస్లింలు హజ్రత్‌ జహంగీర్‌పీర్‌ (జేపీ) దర్గాలో ఉర్సు ఎప్పుడా అని ఎదురుచూస్తుంటారు.

చరిత్ర ప్రకారం సూఫీ సాధువుల వర్ధంతినే ఉర్సు ఉత్సవం గా జరుపుకుంటారు. సూఫీ సాధువుల సమాధులను పూజిస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా ప్రజలందరూ భక్తితో ఉర్సు ఉత్సవంలో పాల్గొంటారు. ఈ ఉత్సవాలకు ముందుగా దర్గా లో ఉన్న బాబాల సమాధులను శుభ్రం చేసి మంచి గంధాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి సమాధులపై చల్లి, ఒక వస్త్రాన్ని (దట్టీ) కప్పి పూలను సమర్పిస్తారు.అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో ఖురాన్ ను పఠిస్తారు. తర్వాత లంగర్ లో పాల్గొని భోజనం భుజిస్తారు. ఈ ఉర్సు ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి కాబట్టి ప్రజలు దర్గాను దర్శించి తమ కోరికలను, మొక్కులను తీర్చుకుంటారు. ముఖ్యంగా సమీప ప్రాంతాలలోని లంబాడి కుటుంబాలు బండ్లు కట్టుకొని వచ్చి ప్రత్యేకంగా కందురులు(మొక్కుబడి తీర్చుకుంటారు ) చేస్తుంటారు. ఉర్సు సందర్భంగా దర్గా లో ఖవాళీలు (సంగీత కార్యక్రమాలు) జరుగుతాయి. అలాగే ముస్లిం సోదరులు సాంప్రదాయక తలపాగాలు, టోపీలు ధరించి చేతిలో జపమాలతో రాత్రింబవళ్ళు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

జేపీ దర్గా చరిత్ర...

సూఫీ గురువుల ప్రభావం వల్ల తెలంగాణలో హిందూ ముస్లిం ఇతర మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవించేవారని అందుకే తెలంగాణలో ఒక మిశ్రమ సంస్కృతి ఉన్నదని చారిత్రక ఆధారాల ప్రకారం చెప్పవచ్చు. ఈ దర్గా లో సమాధులైన సూఫీ గురువుల గురించి చెప్పుకోవాలంటే వందల ఏండ్ల క్రితం హజారత్ సయ్యద్ జహంగీర్ పీరాన్, హజారత్ సయ్యద్ బుర్హనుద్దీన్ అనే సాధువులు ఇరాక్ రాజధాని బాగ్దాద్ నుండి ఇస్లాం మతాన్ని బోధించడం తో పాటు మంచిని వ్యాప్తి చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చారని జీవితకాలం ఇక్కడే ఉండి తుది శ్వాస విడిచారు అనేది చరిత్ర. దీంతో వారి ఇద్దరి సమాధులే జహంగీర్ పీర్ దర్గాగా ప్రసిద్థి చెందిందని ప్రజలు నమ్ముతారు .అలాగే 400 సం.ల క్రితం గోల్కొండ కోటపై విజయం సాధించిన రాజులు ఈ దర్గాకు వచ్చి పూజలు చేసారని ప్రతీతి.అప్పట్లో దర్గాకు నిర్వాహకులు లేనందున తమ సిపాయిలలో ఒకరిని ఈ దర్గాకు సంరక్షకుడుగా నియమించారు. చాలా కాలం వరకు వారి వారసులే దర్గాను సంరక్షించే వారు. ఆ తర్వాత రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆదీనంలోకి ఈ దర్గా వచ్చింది.

దట్టీ..పూలు...

సూఫీ సాధువు సమాధిపై నిర్మించే ఆలయాన్నే దర్గా అంటారు. దర్గా అంటే ప్రవేశద్వారం లేదా గుమ్మం అని అర్థం. ప్రజలు మరణించిన సాధువు ఆశీర్వాదం పొందడానికి దర్గాను దర్శిస్తారు. తమ పక్షాన దేవునికి (అల్లా)కు విన్నపం పంపుతాడని నమ్మిక. అందుకే దర్గాలు తమ విన్నపాలు దేవుని వద్దకు పంపడానికి ప్రవేశ ద్వారాలని విశ్వసిస్తారు. దర్గాలో బాబాలను దర్శించుకునే సమయంలో వట్టి చేతులతో వెళ్లకుండా భక్తులు దట్టీ.. పూలు తీసుకెళుతుంటారు. తమ కోరికలను నెరవేర్చేలా అల్లకు తమ విన్నపాలు తెలపాలని బాబాలకు పూలు, దట్టీ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

దర్గాలో మట్టి పాత్రలు.. ఎగ్జిబిషన్ ఫేమస్...

మట్టితో చేసిన పాత్రలు..ఎగ్జిబిషన్ దర్గా లో చాలా ఫేమస్.దర్గా కు వచ్చిన భక్తులు కచ్చితంగా ఇక్కడ మట్టితో చేసిన వంట పాత్రలు కొంటుంటారు. దాదాపు పది మట్టి పాత్రలు విక్రయించే దుకాణాలు ఇక్కడ ఉన్నాయి. అటికెలు,మంచి నీటి కుండలు,చిన్న పిల్లల కోసం గల్ల గురుగులు,ఆడుకోవడానికి చిన్న చిన్న ఆట వస్తువులు ఇక్కడ లభిస్తాయి. అలాగే ఎగ్జిబీషన్ లో రంగుల రాట్నం, జెయింట్‌ వీల్‌, బ్రేక్ డ్యాన్స్ ,బెలూన్ గన్ ,రింగులు వేయడం,బాల్ త్రో,గుర్రం సవారీ,తదితర ఆట వస్తువులు ద్వారా భక్తులు ఆనందంగా గడుపుతారు.

దర్గాను దర్శించుకోవడానికి రోడ్డు మార్గాలు..

హైదరాబాద్ నుంచి వచ్చేవారికి అఫ్జల్ గంజ్, ఆరంగర్ వద్ద నుంచి దర్గా వరకు బస్సు సౌకర్యం కలదు. మహబూబ్నగర్ మార్గం ద్వారా రావాలనుకుంటే ముందుగా కొత్తూరు కేంద్రానికి రావాలి. అక్కడి నుంచి ఆటోలు బస్సులు అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల ద్వారా రావాలనుకుంటే షాద్నగర్ నుంచి ధూసకల్ మీదుగా దర్గాకు చేరుకోవచ్చు. అలాగే పహాడీ షరీఫ్ తుక్కుగూడ మార్గం ద్వారా వచ్చే భక్తులు మహేశ్వరం మీదుగా తిమ్మాపూర్ నుంచి కొత్తూరు వచ్చి దర్గాకు చేరుకోవచ్చు. కల్వకుర్తి మార్గం ద్వారా వచ్చేవాళ్ళు ముందుగా కడ్తాల్ తర్వాత రావిచెడ్, కొత్తపేట్, ఎక్లాస్కా ఖాన్ పేట్ గ్రామాల మీదుగా వచ్చి దర్గాను దర్శించుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed