'Bhadradri' బీఆర్ఎస్‌కు ప్రతికూలమా ?...అమలుగాని హామీలపై ప్రజల అసంతృప్తి

by Sridhar Babu |   ( Updated:2022-12-13 12:27:01.0  )
Bhadradri బీఆర్ఎస్‌కు ప్రతికూలమా ?...అమలుగాని హామీలపై ప్రజల అసంతృప్తి
X

దిశ, చర్ల : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి పది సీట్లు గెలుస్తామని, భద్రాచలంలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పలుమార్లు ధీమాగా చెప్పారు.‌ దీంతో మిగతా స్థానాల సంగతి పక్కన పెడితే భద్రాచలం అసెంబ్లీ సీటు బీఆర్ఎస్‌‌కి అనుకూలమా లేక ప్రతికూలమా అనేది నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఈసారి గెలుపు ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు సంబరపడుతున్నా, అది అంత ఈజీ కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.‌ భద్రాచలంలో ఆ పార్టీకి ప్రతికూల పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అధికార బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల వర్షం కురిపించి ఈసారి సునాయాసంగా గెలిపిస్తాయని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు. అయితే వారి ఆశ ఏ మేరకు నెరవేరుతుందనేది సందేహంగా ఉంది.

నెరవేరని హామీలతో వ్యతిరేకత

స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భద్రాచలం వచ్చి పట్టణ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భద్రాచలంలో రామాలయ అభివృద్ధి కోసం రూ .100 కోట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ నిధులు ఏళ్లు గడుస్తున్నా విడుదల చేయకపోగా, ఈ వర్షాకాలంలో వరదల సమయంలో మరోమారు వచ్చినపుడు రూ. 1000 కోట్లతో వరద బాధితులకు ఎత్తైన ప్రదేశంలో ఇండ్లు నిర్మించి సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. ఇవి హామీలుగానే ఉన్నాయి తప్ప, ఒక్కటీ అమలుకు నోచుకోవడంలేదని భద్రాచలం పట్టణ ప్రజలతోపాటు అధికార టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్కన ఉన్న పినపాక నియోజకవర్గానికి నిధులు వరదలా విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి భద్రాచలం నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోవడంలేదనే అభిప్రాయం భద్రాచలం పట్టణ ప్రజల్లో వ్యక్తమవుతోంది. భద్రాచలం శివారు ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని ఇటీవల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినప్పటికీ ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం పట్ల భద్రాద్రివాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటామని బీఆర్ఎస్ నాయకత్వం చెబుతున్న ప్రస్తుత సమయంలో కూడా ఆంధ్రాలో కలిపిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తీసుకొనే విషయంలో అధికార‌ పార్టీ నోరు విప్పకపోవడంలో ఆంతర్యం ఏమిటని భద్రాచల పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భద్రాచలం నియోజకవర్గం విషయంలో సీఎం కేసీఆర్‌కి చిత్తశుద్ధి లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఖరి పట్ల అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం అసంతృప్తితో ఉన్నారు. సుమారు 40 వేల పైచిలుకు ఓట్లు ఉన్న భద్రాచలం పట్టణంలో పార్టీని గట్టెక్కించడానికి నాయకులకు ఏ దారీ కనిపించడంలేదు. అక్కడ ఎక్కువ మంది రైతులు లేకపోవడంతో ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తుందని అధికార పార్టీ శ్రేణులు నమ్మే రైతుబంధు పథకం కూడా ఉపయోగపడని పరిస్థితి. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో భద్రాచలం పట్టణ అభివృద్ధి అంతంత మాత్రమే అనే అభిప్రాయం పట్టణ ప్రజల్లో నెలకొంది. పెద్ద ఎత్తున నిధులు విడుదల కాకపోవడం వల్లనే భద్రాచలం అభివృద్ధి కుంటుపడిందని విమర్శించేవారు లేకపోలేదు. ఇక్కడి పరిస్థితులు ఇలా ఉంటే స్వయంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని పట్టణ ప్రజలను ఓట్లు అడగడానికి వెళతామని భద్రాచలం టీఆర్ఎస్ నాయకులు మథనపడుతున్నారు. రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని ఆశ పడుతున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో భద్రాచలం సీటుని తప్పనిసరిగా కమ్యూనిస్టులకే కేటాయిస్తారనే అభిప్రాయం అధికార బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై ఆసలు పెట్టుకున్న నేతలు మరోదారి వెతుక్కుంటున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే భద్రాచలం నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కోలుకోనిదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. పొత్తులను బట్టి ఈ నియోజకవర్గంలో అనూహ్య రాజకీయ పరిస్థితులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పొత్తు పొడిచేనా..? సీపీఎంకి లాభించేనా ?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం సీటు సీపీఎంకి, కొత్తగూడెం సీటు సీపీఐకి కేటాయిస్తారని గులాబీ పార్టీలో ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే బీఆర్ఎస్‌తో పొత్తు సీపీఎంకి ఏ మేరకు మేలు చేస్తుందనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రమంతట పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం అధికార బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనిపిస్తోందని చెప్పక తప్పదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతేగాక అధికార పార్టీలో నాయకుల నడుమ ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు పార్టీకి తీరని నష్టం చేస్తాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకాదని కమ్యూనిస్టులకు ఓట్లు వేయడం కొందరు గులాబీ కార్యకర్తలకు ఏ మాత్రం నచ్చడంలేదు. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేముగానీ ఇప్పుడైతే పొత్తు విషయంలో గులాబీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలంలో గులాబీ జెండా ఎగరడం ఇక కలగానే మిగిలి పోతుందా అని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీతో పొత్తు సీపీఎంకి ఏ మేరకు మేలు చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఎన్నికలు ఖరీదైన ప్రస్తుత తరుణంలో ఒంటరిగా పోటీ చేయడం కంటే లాభమైనా నష్టమైనా బీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్ళడమే మంచిదనే అభిప్రాయం సీపీఎం శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. దీనివలన కొంత ఆర్థిక తోడ్పాటు కలగవచ్చనే భావన లేకపోలేదు. ఇదిలా ఉంటే అధికార బీఆర్ఎస్ పార్టీతో పొత్తు సీపీఎంకు కిందిస్థాయి క్యాడర్‌కి కూడా కొంత నచ్చడం లేదని తెలుస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి ఇవ్వడంలేదని, చర్లలో కోరెగడ్డ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లించడంలేదని, సాగునీటి సమస్యలు పరిష్కరించడంలేదని, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతరం రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్న తాము ఎన్నికల్లో అదే గులాబీ జెండా పక్కనబెట్టుకొని ప్రజల ముందుకు వెళ్ళి ఎలా ఓట్లు అడుగుతామని, అపుడు ప్రజలు ఎలా ఆదరిస్తారని కొందరు సీపీఎం కార్యకర్తల్లో వ్యక్తమౌతున్న అభిప్రాయం. ఎన్నికల ప్రచారపర్వంలో తప్పదన్నట్లుగా మనుషులు, జెండాలు కలిసినా ఇరుపార్టీల నేతల మనసులు కలుస్తాయా అనే అభిప్రాయం మరి కొందరిలో లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల నడుమ సీపీఎం, బీఆర్‌ఎస్‌ల పొత్తు పొడిచి ఏ‌మేరకు ఫలిస్తుందనేది ఆసక్తిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే‌, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి భద్రాచలం నియోజకవర్గంలో ఎన్నికలకు వెళ్లాలి అనుకుంటున్న సీపీఎం ప్రభుత్వ వ్యతిరేకతని ఎలా అనుకూలంగా మార్చుకుంటుందనేది వేచిచూడాలి. అయితే భద్రాచలం బరిలో ఈసారి ముక్కోణపు పోటీ కనిపించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed