హరితహారం లక్ష్యాలను ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలి

by Sridhar Babu |   ( Updated:2024-01-12 12:47:43.0  )
హరితహారం లక్ష్యాలను ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలి
X

దిశ, కామారెడ్డి : తెలంగాణకు హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో హరితహారం కార్యక్రమంపై జిల్లా అటవీ శాఖాధికారి వికాస్ మీనా తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2025, 2026 వార్షిక సంవత్సరాల్లో వివిధ శాఖల ద్వారా మొక్కలు నాటుటకు లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రణాళికా బద్ధంగా ముందుకుసాగాలని కోరారు. అధికారులు లక్ష్యం సాధించాలనే తపనతో కాకుండా మనస్సు పెట్టి నాటిన ప్రతి మొక్క పాడవకుండా జీవించేలా చూడాలని, ఔషధ మొక్కలు, నీడ నిచ్చే మొక్కలు, పూల మొక్కలు, రహదారుల వెంట పెద్ద మొక్కలు నాటాలని అన్నారు. 2024 సంవత్సరంలో 26 లక్షల 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, కాగా 2025 సంవత్సరంలో 17 లక్షల 92 వేల మొక్కలు నాటుటకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అదే విధంగా 2026 నాటికి మొక్కలు నాటుటకు ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు.

క్షేత్ర స్థాయిలో నీటిపారుదల కింద బండ్ ప్లాంటేషన్, అటవీ శాఖ పరిధిలో బ్లాక్ ప్లాంటేషన్, గ్రామ పంచాయతీలు, విద్యా సంస్థలు, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలన్నారు. ప్రధానంగా కరివేపాకు, మునగ, ఉసిరి, చింత, వెలగ వంటి మొక్కలతో పాటు తులసి, అలవీరా, రణపాల వంటి ఔషధ మొక్కలు నాటాలని కోతులు దరిచేరవని అన్నారు. కోతులు బయట సంచరించకుండా అటవీ లోపల పండ్ల మొక్కలు నాటాలని అన్నారు. ఎన్.ఆర్.జీ.ఎస్. కింద రైతులు పండ్ల మొక్కలు నాటేలా ప్రోత్సహించాలని, , ఆయిల్ ఫార్మ్స్ ను ప్రోత్సహించాలన్నారు. పశువులకు గడ్డి కొరకు ప్లాంటేషన్ చేయాలన్నారు.

గ్రామ పంచాయతీలలో అంతర్గత, బహిర్గత రహదారుల వెంట, మున్సిపల్ ప్రాంతాలలో మీడియన్ లో పెద్ద మొక్కలతో పాటు అందమైన పూల మొక్కలు నాటాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో కిచెన్ గార్డెన్లతో పాటు మునగ చెట్లు నాటాలన్నారు. అదే విధంగా మార్కెట్ యార్డు, క్వారీలు, ఆర్టీసీ, ట్రాన్స్కో, ఆర్టీఓ తదితర అన్ని కార్యాలయాల వద్ద పద్ధతి ప్రకారం మొక్కలు నాటాలన్నారు. చెట్లు కొట్టిన, తొలగించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానంగా విద్యుత్ శాఖ వారు విద్యుత్ తీగలకు

కొమ్మలు అడ్డు వస్తున్నాయని చెట్లు నరుకుతున్నారని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదని, ముందస్తుగా సంబంధిత అధికారులకు తెలపాలని, లేకుంటే అటవీ చట్టం, ఆర్ఆర్ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఆర్ డీఓ సాయన్న, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, పశు సంవర్ధక అధికారి సింహారావు, బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, కార్మిక శాఖ సహాయ కమిషనర్ సురేందర్ కుమార్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్, ఆబ్కారీ, మున్సిపల్, హార్టికల్చర్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story