రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

by Sridhar Babu |
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
X

దిశ, కొత్తగూడెం : జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా, ప్రాణాలు కోల్పోకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల వివరాలు నమోదు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు.

జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రామాల్లో పొలీసు కళాబృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పొలీసు అధికారులకు సూచించారు. ఫస్ట్ రెస్పాండర్ గా ఉండేందుకు జాతీయ రహదారుల పక్కన ఉండే పెట్రోల్ బంకులు, దాబాలలో పనిచేసే వారికి, యువతకు, ప్రథమ చికిత్స, సీపీఆర్ పై అవగాహన కలిగించాలన్నారు. జిల్లా పరిధిలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించామని, ఆయా ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు. అటవీ ప్రాంతం ఉన్న చోట నెమ్మదిగా వెళ్లేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఓవర్ లోడింగ్ వాహనాలపై తగు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖాధికారి సదానందంకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్ఎంబీ ఈఈ వెంకటేశ్వరరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, డీసీహెచ్ ఓ రవిబాబు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లందు మున్సిపల్ కమిషనర్లు, కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story