అలరించిన జాతీయస్థాయి మధిర బాలోత్సవ్ పోటీలు

by Sridhar Babu |
అలరించిన జాతీయస్థాయి మధిర బాలోత్సవ్ పోటీలు
X

దిశ, మధిర : శాస్త్రీయ, జానపద నృత్యాలతో చిన్నారులు ప్రేక్షకులను అలరించారు. రామభక్త సీతయ్య కళాపరిషత్ ఆధ్వర్యంలో 27వ జాతీయస్థాయి మధిర బాలోత్సవ్ పోటీలు మండల కేంద్రంలోని బంజారా కాలనీలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఖమ్మం జిల్లా మాజీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్, మధిర రంగస్థలం కళాకారుల సమైక్య అధ్యక్షులు పుతంభాక శ్రీకృష్ణ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో మొత్తం 94 టీంలు పాల్గొంటారని, రెండు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో ఏకపాత్రాభినయం, శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాల పోటీలు నిర్వహిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ వై.ప్రభాకర్ రావు, శ్రీకృష్ణ ప్రసాద్, రామభక్త సీతయ్య కళాపరిషత్ అధ్యక్షుడు అర్. ( బబ్లా )బాబూరావు మాట్లాడుతూ ప్రాచీన కళలకు పుట్టినిల్లు మధిర అని, విద్యతోపాటు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ పోటీలు దోహదపడతాయని అన్నారు. మన సాంస్కృతి, సాంప్రదాయాలను ముందు తరాల వారికి అందించే విధంగా కళాకారులను ప్రోత్సహించాలని, కళలను ప్రదర్శించడం ద్వారా అందరికీ అవగాహన కలుగుతుందన్నారు.

హైదరాబాద్, వరంగల్, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, కోదాడ, సూర్యాపేట, విజయవాడ, సత్తుపల్లి, ఖమ్మం, బాపట్ల, జగ్గయ్యపేట, గంపలగూడెం తదితర ప్రాంతాల నుండి ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమిటీ ఖమ్మం ఉపాధ్యక్షులు వై.శ్రీనివాసరావు, ఆర్.రవికుమార్, సహాయ కార్యదర్శి బి.రాధాకృష్ణ, పారుపల్లి సురేష్, రామదాస్ కృష్ణమూర్తి, కళ్యాణ పుల్లారావు, రోశయ్య చౌదరి, హరినాథ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story