రాజన్న ఆలయంలో కార్తీక శోభ

by Sridhar Babu |   ( Updated:2024-11-15 16:04:20.0  )
రాజన్న ఆలయంలో కార్తీక శోభ
X

దిశ, వేములవాడ : తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్తీక దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులందరూ కార్తీక దీపాలను వెలిగించారు. ఒక్కసారిగా వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించడంతో ఆలయం మొత్తం దీప కాంతులతో నిండిపోయింది. ఇదిలా ఉండగా ఆలయ ముందు భాగంలో ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం నుండి ఉత్సవమూర్తులను ఊరేగించారు.

తదనంతరం ఆలయానికి వచ్చిన భక్తులు సైతం జ్వాలతోరణం నుంచి పయనించేందుకు బారులుతీరారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భక్తులు అధిక సంఖ్యలో జ్వాలా తోరణం వద్దకు రావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో క్షణాల వ్యవధిలోనే ఆలయ అర్చకులు ఈఓ వినోద్ రెడ్డి చేతుల మీదుగా పూజ కార్యక్రమాలను పూర్తి చేసి ఉత్సవమూర్తులను ఆలయంలోనికి తీసుకువెళ్లారు. దీంతో ఎన్నో ఆశలతో జ్వాలా తోరణం కార్యక్రమాన్ని చూసేందుకు విచ్చేసిన భక్తులు అసహనంతో వెనుతిరిగారు. ఆలయ అధికారుల తీరుపై, వేడుకల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని చర్చించుకున్నారు. మరోవైపు ఆలయ ఓపెన్ స్లాబ్ లో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు కన్నులపండుగగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాలను ఆలయ ఏఈఓలు బ్రాహ్మణగారి శ్రీనివాస్, శ్రవణ్ లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed