Bhatti Vikramarka: అలా అయితేనే సామాజిక మార్పు సాధించగలం

by Gantepaka Srikanth |
Bhatti Vikramarka: అలా అయితేనే సామాజిక మార్పు సాధించగలం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరా మహిళా శక్తి పథకం(Indira Mahila Shakti Scheme) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. శుక్రవారం ప్రజాభవన్‌లో అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తి(Solar power generation)కి త్వరితగతన చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని తెలిపారు. సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక నిధులకు గాను బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలన్నారు. రుణాల రీ పేమెంట్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులు 99 శాతం ప్రగతిని కనబరుస్తున్నందున, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తిగా ఉన్నారన్నారు.

ఇటీవల బ్యాంకర్ల సమావేశంలోనూ స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు, ఆర్టీసీకి బస్సుల సమకూర్చేటువంటి మరిన్ని పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతను ఇవ్వడం ద్వారా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ద్వారా సామాజిక మార్పు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్, ఎస్ఈఆర్పీ సీఈఓ దివ్య దేవరాజన్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ వావిలాల అనీల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed