Tammineni : కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయాలి

by Sridhar Babu |
Tammineni : కాంగ్రెస్ వాగ్దానాలు అమలు చేయాలి
X

దిశ, నేలకొండపల్లి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా వాగ్దానాలు అమలు కావటం లేదని తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం మండల పరిధిలోని ముఠాపురం గ్రామంలో చావా లేనిన్ బాబు సంస్మరణ సభకు తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటిందని, అయినా వాగ్దానాలు అమలు కావటం లేదన్నారు. రైతు రుణమాఫీ చేస్తామని పాక్షికంగానే అమలు చేశారన్నారు. రుణమాఫీలో లోపాలు జరుగుతున్నాయని రైతులు తమ దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఈ సమస్యలపై దృష్టి పెట్టి వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇక రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ అమలు కాలేదని, రుణమాఫీకి రేషన్ కార్డుకు లింక్ పెట్టడం అనేది చాలా తప్పు అని, దానిని ప్రభుత్వం వెంటనే సరిచేయాలన్నారు. ఇటీవల మృతి చెందిన ఓ రైతు భార్య తన గోడు తనకు చెప్పుకుంది అన్నారు. ఇటీవల మృతి చెందిన వారిపై ఉన్న లోన్ మాఫీ కాదని బ్యాంకు అధికారులు చెప్పడం ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉందన్నారు. చనిపోయిన వారి పేరు మీద ఉన్న రుణాలను కూడా రద్దు చేసే విధంగా బ్యాంక్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రుణమాఫీ

అయిన రైతులకు తిరిగి లోను ఇవ్వటానికి సంతకాల పేరిట అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఏదో ఒక విధంగా వివిధ కారణాలతో ప్రభుత్వం రైతులకు ఇచ్చే మాఫీ తగ్గించుకోవాలని చూస్తుందని అన్నారు. రైతులు ఎంతో ఆశతో రెండు లక్షలు రుణమాఫీ అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించారని, ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేసిందో అవన్నీ వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story