ఖమ్మం ఆర్యవైశ్య మహాసభలో కుమ్ములాట..!

by Shiva |
ఖమ్మం ఆర్యవైశ్య మహాసభలో కుమ్ములాట..!
X

దిశ, ఖమ్మం సిటీ: ఆర్యవైశ్య ఖమ్మం నగర మహాసభలో అంతర్గతంగా కుమ్ములాటలు మొదలయ్యాయి. గత కొన్ని ఏళ్లుగా ఆర్యవైశ్య మహాసభల ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వన భోజనాలు నిర్వహించాలంటే అయ్యే ఖర్చు ఆర్య వైశ్య ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంతోనే నిర్వహించవచ్చు. కానీ మళ్లీ వన భోజనాల పేరుతో డబ్బులు వసూళ్లు చేయడం పలు విమర్శలు వస్తున్నాయి. మా డబ్బులతో మాకే తినిపిస్తే ఎలా అని కొందరు విమర్శిస్తుంటే మరికొందరు గతంలో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 2022లో ఏర్పాటు చేసిన వన భోజనాలకు వచ్చిన డబ్బులు ఎంత.. ఖర్చు పెట్టిందెంత తెలియలంటూ మరికొందరు సంఘ సభ్యులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈనెల24న వన భోజనాలకు ఏర్పాట్లకు ముందే నిలదీస్తుండటంతో వారే తెరచాటున ఉండి సమస్యలు పెరగకుండా రాజీ కుదురుస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చ జరగడంతో సంఘ పెద్దల మెడకు చుట్టుకునే పరిస్థితి తలెత్తడంతో వారు గొడవ పెట్టుకున్న వారికి సర్దిచెప్పి వనభోజనాల ఏర్పాటుకు రంగం ముమ్మరం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అంతా రహస్యమే..

ఆర్యవైశ్య ఆస్తులు ఎన్ని ఉన్నాయి.. వాటి నుంచి వచ్చే ఆదాయంతో ఏ పేద వైశ్యుడికి ఎంత లాభం చేకూరింది అనే లెక్కలు ఏఒక్క సభ్యుడికి తెలియదంటే అతిశయోక్తి ఏమి లేదు. దీనిని అడ్డుపెట్టుకొన్న పెద్దలు కొందరు తెర వెనుక ఉండి ఆర్యవైశ్య ఆస్తులను ఇష్టానికి వాడుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ.కోట్ల విలువ చేసే భూములు, ఆస్తులు నగరంలో ఉన్నప్పటికీ నిరుపేద వైశ్యులకు అవి ఉపయోగపడడం లేదంటే సంఘంలో వారి పాత్ర ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం పేద ఆర్యవైశ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారికి ఖర్చుపెట్టేలా ఆర్యవైశ్య పూర్వీకులు అన్న సత్రాలను, సేవా సంస్థలను ఏర్పాటు ఏర్పాటు చేశారు. రాను రాను ఆ ఆస్తులకు విలువ పెరగడంతో వాటిపై కన్నువేసిన పెద్దలు కొందరు వాటిని వారి గుప్పిట్లో పెట్టుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్లు పేరుతో వచ్చిన వడ్డీని కూడా సొంతాలకు ఉపయోగించుకుంటున్నారని సంఘంలోని మరికొందరు అసహన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో నర్తకి టాకీస్ రోడ్‌లోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఆర్యవైశ్య ఆస్తికి సంబంధించిన గ్రంథాలయ భవనాన్ని రైల్వే శాఖ కూల్చి ఆ ఆస్తికి సంబంధించి సుమారు రూ.70లక్షలకు పైగా నష్ట పరిహారం చెల్లిస్తే ఆ డబ్బులు పేద ఆర్యవైశ్యులకు వినియోగించకుండా ఫిక్స్ డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా వచ్చే వడ్డీ ఎవరు మింగుతున్నారో తెలియని పరిస్థితిలో ఆర్యవైశ్యులు ఉన్నారనేది వాస్తవం. ఇదొక్కటే కాక నగరంలో పలు ప్రాంతాల్లో ఆర్యవైశ్య ఆస్తులు ఉన్నప్పటికీ వాటి నుంచి వచ్చే ఆదాయం కూడా ఎటు పోతుందో తెలియని పరిస్థితిలో పేద, మధ్యతరగతి ఆర్య వైశ్యులు ఉన్నారు. వీరిని చైతన్య పరిస్తే ఎక్కడ పెద్దల బాగోతాలు బయటపడతాయోనని వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొంతమందిని ఎంపిక చేసి వారి ప్రతినిధులుగా సంఘ పెద్దలుగా చలామణి అవుతూ.. ఆస్తులపై అజమాయిషీ కొనసాగిస్తున్నట్లు విమర్శలు లేకపోలేదు.

Advertisement

Next Story

Most Viewed