ఆ నియోజకవర్గంలో నిలిచేదెవరు.. నిష్క్రమించేదెవరు.. ఎమ్మెల్యే శిబిరంలో తీవ్ర చర్చలు

by Vinod kumar |   ( Updated:2023-01-09 14:02:28.0  )
ఆ నియోజకవర్గంలో నిలిచేదెవరు.. నిష్క్రమించేదెవరు.. ఎమ్మెల్యే శిబిరంలో తీవ్ర చర్చలు
X

దిశ, వైరా: రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పటం ఖాయంగా కనిపిస్తుంది. అదే క్రమంలో శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరటం దరిదాపు ఖరారైంది. బీజేపీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలతో పాటు వైరా నియోజకవర్గ రాజకీయాల్లో మార్పులు చేసుకుంటాయి. వైరా నియోజకవర్గంలో ఇప్పటివరకు శ్రీనివాసరెడ్డి వర్గీయులు, ఎమ్మెల్యే రాములు నాయక్ ఫాలోవర్స్‌గా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామంలో పొంగులేటి వర్గీయులు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ వెంట నిలిచేదెవరు.. నిష్క్రమించేది ఎవరనే చర్చ వైరా నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రధానంగా వైరా ఎమ్మెల్యే శిబిరంలో కూడా ఈ చర్చ తీవ్రస్థాయిలో నడుస్తుంది. పొంగులేటి వర్గీయులుగా ఉండి.. వైరా ఎమ్మెల్యే కు ఎన్నికల నాటి నుంచి అండగా ఉన్న వారందరూ పొంగులేటితో బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. బీజేపీలో చేరే విషయమై పొంగులేటి వర్గీయుల్లో మాత్రం మిశ్రమ స్పందన లభిస్తుంది.

పొంగులేటి వర్గీయుల్లో అంతర్మధనం..

బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు వైరా నియోజకవర్గంలోని పొంగులేటి వర్గీయుల్లో అంతర్ మదనం నెలకొంది. వైరా నియోజకవర్గంలో పొంగులేటి అనుచరులుగా ఓసీ, బీసీ నేతలతో పాటు ఎస్సీ, మైనార్టీ వర్గాల వారు అధికంగా ఉన్నారు. అయితే మతోన్మాద బీజేపీలో చేరేందుకు ఎస్సీ, మైనార్టీ వర్గాల వారు అంత సుముఖంగా లేరు. హిందుత్వం పేరుతో ముస్లింలు, క్రైస్తవులను బీజేపీ పార్టీ దేశంలో అణగదొక్కుతుందని ఆ వర్గాల్లో స్పష్టమైన అభిప్రాయం ఉంది. దీనివల్ల ఆ వర్గాల్లోని వారు బీజేపీ ను ఆదరించే అవకాశం లేదు. ఈ పరిణామాలను అన్నిటినీ చర్చించుకున్న వైరాలోని పొంగులేటి వర్గీయులు అంతర్మధనంలో ఉన్నారు. ఒకవైపు అధికార బీఆర్ఎస్ పార్టీని వదిలి మరోవైపు మతోన్మాద పార్టీలోకి వెళ్లి రాజకీయంగా భవిష్యత్తును కోల్పోవాల్సి వస్తుందని పొంగులేటి వర్గీయులు తమలో తాము కుంగిపోతున్నారు.

ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ప్రజాప్రతినిధుల పరిస్థితి..

జిల్లా రాజకీయాల్లో జరగబోయే మార్పులతో వైరా నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారింది. గత సర్పంచ్ ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా ఆపదలో ఉన్న ప్రజాప్రతినిధులను, తన వర్గీయులను ఆయన ఆర్థికంగా ఆదుకున్నారని ప్రచారం ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'దళిత బంధు' పథకాని వైరా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులందరికీ ఒక్కో యూనిట్ కేటాయిస్తానని ఇటీవల ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రకటించారు.

ఈ మేరకు ప్రజాప్రతినిధుల నుంచి లబ్ధిదారుల పేర్లను సేకరించారు. ఈ పరిణామాలతో తమకు ఎన్నికల్లో, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట వెళ్లాలా..? దళిత బంధు యూనిట్ కేటాయించిన ఎమ్మెల్యే తో ఉండాలా అనే విషయాన్ని ప్రజాప్రతినిధులు తేల్చుకోలేకపోతున్నారు. అంతేకాకుండా పొంగులేటి వెంట వెళ్తే.. దళిత బంధు యూనిట్ ఇవ్వరనేది ప్రజాప్రతినిధులకు అర్థమైంది. ఆదివారం వైరాలో జరిగిన అంతరంగిక సమావేశంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతోనే స్పష్టత వచ్చింది.

మళ్లీ తెరపై కక్షపూరిత రాజకీయాలు..?

ఖమ్మం జిల్లాలో చోటు చేసుకోనున్న రాజకీయ పరిణామాలతో వైరా నియోజకవర్గంలో మళ్లీ తెరపైకి కక్షపూరిత రాజకీయాలు వస్తాయని భయాందోళనలు మొదలయ్యాయి. అందుకు ఎమ్మెల్యే రాముల నాయక్ ఆదివారం చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. బీఆర్ఎస్‌ను ఎవరైనా వీడితే లా అండ్ ఆర్డర్‌ను తన చేతిలోకి తీసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే సభాముఖంగా స్పష్టం చేయటం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 2014 నుంచి 2018 సంవత్సరం వరకు వైరా నియోజకవర్గంలో కక్షపూరిత రాజకీయాలకు కొనసాగాయి. 2018 నుంచి 2022 సంవత్సరం వరకు కక్షలు సాధించేంత రాజకీయాలు కనిపించలేదు. ప్రస్తుతం రాజకీయ సమీకరణలు మారుతుండటంతో పాటు ఎమ్మెల్యే బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో మరలా పాత రోజులు వైరాలో పునరావృతం అవుతాయని నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story