Gas Dealers : అదనపు దోపిడీ.. ఇండేన్, భారత్ గ్యాస్ డీలర్ల బాగోతం..

by Sumithra |
Gas Dealers : అదనపు దోపిడీ.. ఇండేన్, భారత్ గ్యాస్ డీలర్ల బాగోతం..
X

దిశ, వైరా : గ్యాస్ సిలిండర్ కంపెనీలు ఎమ్మార్పీ కంటే అదనంగా వినియోగదారుల నుంచి నగదును వసూలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాయి. గత ఐదేళ్లుగా అదనపు దోపిడీ బాగోతం కొనసాగుతోంది. గ్యాస్ సిలిండర్లకు డోర్ డెలివరీ పేరుతో అదనపు బాదుడుకు పాల్పడుతున్నారు. వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక్కో గ్యాస్ సిలిండర్ కు రూ.50 నుంచి రూ. 100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా బహిరంగంగా కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. వైరా మండలంలో ఇండేన్, భారత్ గ్యాస్ కంపెనీల అదనపు దోపిడీ యదేచ్చగా కొనసాగుతుంది. వైరాలో ఉన్న ఓ గ్యాస్ కంపెనీతో పాటు, ఖమ్మంకు చెందిన మరో రెండు గ్యాస్ కంపెనీలు, కల్లూరు చెందిన మరో గ్యాస్ కంపెనీ అదనంగా అక్రమ వసూళ్లలో మునిగి తేలుతున్నాయి.

రూ.50 నుంచి రూ.100 అదనపు బాదుడు..

భారత్, ఇండేన్ గ్యాస్ సంబంధించిన మొత్తం నాలుగు గ్యాస్ ఏజెన్సీలు వైరా మండలంలో ఒక్కోగ్యాస్ సిలిండర్ కు రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. వైరా మండలంలోని సోమవారం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ కాణిపాకం విగ్నేశ్వర ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్, ఖమ్మంకు చెందిన శ్రీ జై గురుదత్త ఇండేన్ గ్యాస్ కంపెనీ, గాయత్రి భారత్ గ్యాస్ ఏజెన్సీ, కల్లూరుకు చెందిన ఆదిత్య భారత్ గ్యాస్ ఏజెన్సీలు పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ డోర్ డెలివరీ పేరుతో వినియోగదారుల నుంచి ముక్కు పిండి అదనంగా నగదు వసూలు చేస్తున్నాయి.

నిబంధనల ప్రకారం వైరా పట్టణంలో ఒక్కో గ్యాస్ సిలిండర్ ను రూ.842 కు గ్యాస్ కంపెనీలు డోర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా వినియోగదారుడికి డోర్ డెలివరీ సదుపాయం కల్పించాలి. ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలోపు డోర్ డెలివరీకి 10 రూపాయలు, 10 నుంచి 25 కిలోమీటర్ల దూరంలోపు డోర్ డెలివరీ 20 రూపాయలు అదనంగా వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే వైరా పట్టణంలో ఐదు కిలోమీటర్ల దూరంలోపు ఉన్న వినియోగదారుల వద్ద నుంచి ఈ గ్యాస్ కంపెనీలు 900 రూపాయలు నగదును వసూలు చేస్తున్నాయి. 10 నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉన్న మండలంలోని గ్రామాల్లో రూ.852 నుంచి రూ.862 వరకు నదులు వసూలు చేయాల్సిన కంపెనీలు ఏకంగా రూ.950 నగదును వసూలు చేస్తున్నాయి. ఈ వ్యవహారం సుమారు ఐదేళ్లగా కొనసాగుతున్న పట్టించుకునే వారే కరువయ్యారు.

నెలకు 12 లక్షలు అదనపు వసూళ్లు..

వైరా పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో నెలకు సుమారు 16 వేల గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఒక్కో సిలెండరుకు యావరేజ్ గా 75 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారం ప్రతి నెల గ్యాస్ సిలిండర్ వినియోగదారుల నుంచి కంపెనీ ప్రతినిధులు సుమారు 12 లక్షల నగదును దోచుకుంటున్నారు. ఇదంతా బహిరంగంగా కొనసాగుతున్నా పట్టించుకునే అధికారులే కరువయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే వినియోగదారుడు ఇంటికి కూడా సిలిండర్ ను సరఫరా చేయటం లేదు. గ్రామంలోని సెంటర్లో మాత్రమే సిలిండర్లను దిగుమతి చేస్తున్నారు. అయినప్పటికీ ఒక్కోగ్యాస్ సిలిండర్ కి గ్రామాల్లో 950 రూపాయలను వసూలు చేస్తున్నారు.

సేఫ్టీ కిట్టు నిబంధనకు పాతర..

గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సేఫ్టీ కిట్ నిబంధనలకు పాతర వేస్తున్నారు. నిబంధన ప్రకారం గ్యాస్ వినియోగదారుడు ఇంటి వద్ద సిలిండర్ దింపిన వెంటనే వెయిట్ మిషన్ పై సిలిండర్ ను తూకం వేసి వినియోగదారుడికి చూపించాల్సి ఉంటుంది. అనంతరం ఓరింగ్ మిషన్, లీకేజ్ మిషన్ తో వినియోగదారుడు ముందే గ్యాస్ సిలిండర్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు వైరా మండలంలో ఎక్కడ అమలు చేయడం లేదు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే వాహనంలో వెయిట్ మిషన్, ఓరింగ్ మిషన్, లీకేజీ మిషన్లు ఉండటం లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైరా మండలంలో గ్యాస్ కంపెనీల దోపిడీని అరికట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed