నేతల మధ్య మాటల యుద్ధం

by Sridhar Babu |

దిశ, భద్రాచలం : కాంగ్రెస్,బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధంతో భద్రాద్రి రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి భద్రాచలం వచ్చిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ అభివృద్ధి గురించే పార్టీ మారానని చెప్తున్న ఎమ్మెల్యే వెంకట్రావు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. దాడులు చేయడం మాకూ వచ్చు అన్నారు. తమ నాయకుడు ఆదేశిస్తే రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అవుతుందని పేర్కొన్నారు. రేగా కాంతారావు మాటలకు కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు.

ఆ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, కొండిశెట్టి కృష్ణమూర్తి, అరికెళ్ల తిరుపతిరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ ఎస్ లో జాయిన్ అయినప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదని రేగా ను ప్రశ్నించారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావును విమర్శించే అర్హత రేగాకు లేదని వారన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా ఉండి, జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయాడని, చివరకు రేగా కూడా చిత్తుచిత్తుగా ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. తెల్లం వెంకట్రావు తన సొంత చరిష్మాతో గెలుపొందాడని పేర్కొన్నారు. తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కరకట్ట పొడిగింపుకు 40 కోట్ల రూపాయలు, భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి పది కోట్ల రూపాయలు, రామాలయం అభివృద్ధికి 60 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని తెలిపారు. భద్రాచలం నుండి పోటీ చేసి గెలుపొందాలని రేగా కలలు కంటున్నారని, వెంకట్రావు ఏ పార్టీలో ఉన్నా ప్రజలు ఆయన్ని గెలిపిస్తారని పేర్కొన్నారు.

Advertisement

Next Story