Delhi liquor Scam: కేసులో కీలక పరిణామాలు..

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-07 14:59:15.0  )
Delhi liquor Scam: కేసులో కీలక పరిణామాలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ లభించింది. తన భార్య అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో రాఘవ పెట్టుకున్న పిటిషన్‌కు కోర్టు అంగీకరించింది.

అతడి భార్య హాస్పిటల్ రికార్డులను పరిశీలించిన అనంతరం కోర్టు బుధవారం అతడికి బెయిల్ మంజూరు చేసింది. తన భార్య అనారోగ్య రీత్యా తనకు ఆరు వారాల బెయిల్ ఇవ్వాలని చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. రెండు వారాల బెయిల్‌కు సమ్మతించింది. కాగా ఈ కేసులో రాఘవరెడ్డిని గత ఫిబ్రవరి 10న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూప్‌లో రాఘవ కీలక పాత్రధారిగా వ్యవహరించారని, ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ అభియోగాలు మోపింది.

ఆసక్తిగా లిక్కర్ స్కాం కేసు పరిణామాలు..

దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి మనీలాండరింగ్ దర్యాప్తులో ఇటీవలే అప్రూవర్‌గా మారారు. ఆయన అప్రూవర్‌గా మారి వారం గడవకముందే మాగుంట రాఘవకు ఉపశమనం దక్కడం ఆసక్తిగా మారింది.

అంతకు ముందు సీబీఐ కేసులో నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా సైతం అప్రూవర్‌గా మారారు. అయితే వీరంతా సౌత్ గ్రూప్‌లో కీలకంగా వ్యవహరించిన వారేనని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. మరో వైపు ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సైతం ఆరోపణలు వచ్చాయి. గతంలో కవితను దర్యాప్తు సంస్థలు ప్రశ్నించాయి. అయితే ఇటీవల సౌత్ గ్రూప్ విషయంలో ఒక్కొక్కరు అప్రూవర్‌గా మారుతుంటే మరో వైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మాత్రం బెయిల్ లభించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

తన భార్య అనారోగ్యంతో బాధపడుతోంది ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అందుకోసం తనకు ఆరు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సిసోడియా ఢిల్లీ హైకోర్టులో పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. సిసోడియా బెయిల్ నిరాకరించిన కోర్టు.. ఆయన భార్యను చూసి వచ్చేందుకే మాత్రం అనుమతి ఇచ్చింది. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారిన తర్వాత రాఘవకు బెయిల్ రావడంపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read..

లిక్కర్ స్కామ్‌‌లో సరికొత్త ట్విస్ట్.. ఆయన నోరు విప్పితే కవితకు చిక్కులు తప్పవా?

Advertisement

Next Story

Most Viewed