- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఎట్ హోమ్’కు వరుసగా మూడోసారి కేసీఆర్ గైర్హాజరు.. గవర్నర్ రియాక్షన్ ఇదే!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన ఆమోదం కోసం వచ్చిన బిల్లులు పరిశీలనలో ఉన్నాయని, వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యానించారు. అయినా వాటిపై స్పందించడానికి ఇది తగిన సమయం కాదన్నారు. పంద్రాగస్టు సందర్భంగా రాజ్‌భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ తేనీటి విందు కార్యక్రమం సందర్భంగా గవర్నర్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రికి రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్ళిందని, ఆయన హాజరవుతారనే అనుకున్నామని, కానీ గైర్హారజయ్యారని తెలిపారు. ఆహ్వానం అందుకున్న తర్వాత రావడం, రాకపోవడం ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారమని, అది రాజ్‌భవన్ పరిధిలోని అంశం కాదన్నారు.
ముఖ్యమంత్రి వరుసగా మూడోసారి గైర్హాజరయ్యారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరుకాలేదు. ఆయన హాజరుకాకపోవచ్చంటూ రెండు రోజుల ముందుగానే అధికారుల ద్వారా మీడియాకు సమాచారం అందింది. ఈ వార్తలకు బలం చేకూరే విధంగానే ముఖ్యమంత్రి గోల్కొండ కోట నుంచి చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో “రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోడానికి విఫల ప్రయత్నాలు చేశాయి” అంటూ పరోక్షంగా గవర్నర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దానికి కొనసాగింపుగా “కానీ వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది..” అని కేసీఆర్ ప్రస్తావించడం గమనార్హం.
రాజ్‌భవన్ తేనీటి విందు కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ లీడర్లకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్ళినా పెద్ద నేతలు హాజరుకాలేదు.
కార్యక్రమం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేస్తూ.. గవర్నర్ల విషయంలో ముఖ్యమంత్రుల తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారని అన్నారు. తమిళనాడులో గవర్నర్, ముఖ్యమంత్రి సంబంధాలను ప్రస్తావిస్తూ తాజాగా పుదుచ్చేరిలో చేసిన కామెంట్లను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... తాను ఒకేసారి తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ డొమెయిన్‌లో ఉన్నాయన్నారు. ఏమేం కామెంట్లు చేశామన్నది ఇప్పటికే ప్రజలకు చేరిందని, మరోసారి ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు. గవర్నర్లపై ముఖ్యమంత్రుల తీరు ఈ తరహాలో ఉండడం మంచిది కాదన్నారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం దూరంగా ఉండడంపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.