కేబీఆర్ పార్కుకు 24 ఏళ్లు

by samatah |   ( Updated:2022-12-03 15:43:10.0  )
కేబీఆర్ పార్కుకు 24 ఏళ్లు
X

దిశ తెలంగాణ బ్యూరో : రాజధాని హైదరాబాద్ మధ్యలో ప్రకృతి మణిహారంలా ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం (కేబీఆర్ పార్క్) ఇరవై నాల్గవ ఏట (24) అడుగు పెట్టింది. 1998లో కేంద్ర ప్రభుత్వం ఈ అటవీ ప్రాంతాన్ని నేషనల్ పార్క్ గా ప్రకటించింది. సుమారు 380 ఎకరాల్లో విస్తరించిన కేబీఆర్ పార్క్ అటవీ ప్రాంతం అభివృద్ది చెందిన హైదరాబాద్ కు సహజ ఆక్సీజన్ వనరుగా పనిచేస్తోంది. నిత్యం వందలాది మంది సందర్శకులు, వాకర్స్ కు కేబీఆర్ పార్క్ ప్రకృతి అందాలను పంచటంతో పాటు, విభిన్న జీవ వైవిధ్యంతో పర్యావరణ ప్రాధాన్యతను తెలుపుతోంది. ఈ పార్క్ లో విరివిగా కనిపించే జాతీయ పక్షి నెమలి పేరుమీదే ఆవిర్భావం రోజు (డిసెంబర్-3) పికాక్ డే నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది.

ఈయేడాది ఉత్సవాలను వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి తరలివచ్చిన విద్యార్థుల మధ్య అటవీ శాఖ ఘనంగా నిర్వహించింది. స్కూలు పిల్లలకు డ్రాయింగ్, పెయిటింగ్, ఇతర పోటీలను నిర్వహించి అధికారుల చేతులమీదుగా బహుమతులు అందించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలు, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యుల స్నేక్ షో అలరించాయి.

ముఖ్య అతిధిగా హాజరైన పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్ మాట్లాడుతూ కేబీయార్ పార్క్ రాజధాని హైదరాబాద్ కు ప్రకృతి- పర్యావరణ నిధిలాగా పనిచేస్తోందని, ఔటర్ చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తున్న అర్బన్ పార్కులు మరింతగా పచ్చదనం పంచుతూ పరిసర ప్రాంత ప్రజలకు స్వచ్చమైన ఆక్సీజన్ ను అందిచటంతో పాటు, పర్యావరణ ప్రాముఖ్యతను చాటుతున్నాయని అన్నారు.

హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ సైదులు మాట్లాడుతూ కేబీఆర్ పార్కులో ఈ యేడాది 544 నెమళ్ల సంఖ్య నమోదైందని, పార్క్ విశిష్టతను కాపాడుతూనే ఇక్కడికి వచ్చే సందర్శకులు, వాకర్స్ కు తగిన సౌకర్యాలు అందిస్తామన్నారు. జిల్లా అటవీ అధికారి ఎం. జోజి నేతృత్వంలో రూపొందించిన పార్క్ ప్రత్యేక బ్రోచర్ ను అధికారులు ఆవిష్కరించారు.

కార్యక్రమంలో పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, పీసీసీఎఫ్ (ఎఫ్ సీఏ) ఎం.సీ పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్ లు త్రినాథ్ కుమార్, వినయ్ కుమార్ తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అటవీ అధికారులు, కేబీఆర్ పార్క్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story