సీనియర్ జర్నలిస్ట్ నాయిని మధునయ్య ఆత్మహత్య

by Mahesh |
సీనియర్ జర్నలిస్ట్ నాయిని మధునయ్య ఆత్మహత్య
X

దిశ, గోదావరిఖని: గోదావరిఖని కి చెందిన సీనియర్ జర్నలిస్ట్, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు నాయిని మధునయ్య బుధవారం తెల్లవారుజామున గోదావరిఖని హనుమాన్ నగర్ లో గల తన సింగరేణి క్వార్టర్ లో పై కప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనకు ముందే మధునయ్య తాను రాసిన వార్త కథనాలను రోజువారీ లాగా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే మధునయ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ సంఘటన దావనంలా వ్యాపించడంతో పారిశ్రామిక ప్రాంతంలోని పలు పార్టీల నాయకులు, జర్నలిస్టులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సింగరేణిలో సుదీర్ఘంగా పనిచేసిన మధునయ్య పదవీ విరమణ అనంతరం ఇల్లు నిర్మాణం విషయంలో ఒక బిల్డర్ వద్ద డబ్బులు పెట్టారు. ఇంకా పలు కారణాలతో మనస్థాపానికి గురైన మధునయ్య తన చావుకు పలువురు కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోదావరిఖనిలో మొదటి తరం నుంచి జర్నలిస్టుగా కొనసాగుతున్న మధునయ్య ఎన్నో ఉద్యమాల్లో సైతం చురుకైన పాత్ర పోషించాడు. పారిశ్రామిక ప్రాంతానికి సుపరిచితుడుగా ఉన్న మధునయ్య ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన మిత్రులైన స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జర్నలిస్టు మిత్రులు తన కుటుంబానికి అండగా నిలిచి ఆదుకోవాలని సూసైడ్ నోట్లో కోరారు. కనిపించిన ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించే జర్నలిస్ట్ మధునయ్య ఆత్మహత్య ఘటనతో విషాద ఛాయలు అలముకున్నాయి. మధునయకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Next Story