రామగుండం ఆసుపత్రి త్వరగా పూర్తి చేయాలి

by Sridhar Babu |   ( Updated:2024-12-24 12:12:05.0  )
రామగుండం ఆసుపత్రి త్వరగా పూర్తి చేయాలి
X

దిశ, గోదావరిఖని : నూతనంగా నిర్మిస్తున్న 350 పడకల రామగుండం ప్రభుత్వ ఆసుపత్రి పనులను 10 నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికా రులకు సూచించారు. మంగళవారం ఆయన ఆసుపత్రి పనులను, గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ దశలో ఉన్న పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం ప్రకారం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు 10 నెలల్లో అందుబాటులోకి నూతన ఆసుపత్రి భవనాన్ని తీసుకుని రావాలని అన్నారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలోని జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ డెంటల్, ఏఆర్టీ సెంటర్, న్యూ బ్లాక్ లను పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రి సిబ్బంది విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని సూచించారు.

ఆసుపత్రిలో రోగులకు నిర్వహించే వివిధ పరీక్షల ఫలితాలు వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. టిఫా స్కానింగ్ సేవలు గర్భిణి మహిళలు విస్తృతంగా వినియోగించుకునేలా చూడాలని అన్నారు. ఆస్పత్రిలోని పేషంట్లతో మాట్లాడి వారికి ఏ విధమైన సేవలందితున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో జరుగుతున్న ఔట్ పేషంట్ సేవల వివరాలను తెలుసుకున్న కలెక్టర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మన ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించాలని అన్నారు. అనంతరం రామగుండం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓటరు జాబితాలో వచ్చిన దరఖాస్తుల స్థితిగతులు, ధరణి దరఖాస్తుల వివరాలను తెలుసుకొని పెండింగ్ లో ఉండకుండా చూడాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట రామగుండం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్, ఆసుపత్రి ఆర్ఎంఓ అప్పారావు, డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed