ASP Seshadrini Reddy : వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

by Sumithra |
ASP Seshadrini Reddy : వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
X

దిశ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్ 100 కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని వేములవాడ సబ్ డివిజన్ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. గురువారం వేములవాడ పట్టణ సమీపంలోని గంజి వాగు వద్ద ప్రస్తుత పరిస్థితులను వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ తో కలసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఎస్పీ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంటుందని, వాటి వద్దకి ఎవరు వెళ్లవద్దని, వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను గానీ చేతులతో తాకవద్దని సూచించారు.

వాహనాదారులు వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలని, బురద కారణంగా టైర్లు జారి ప్రమాదానికి గురయ్యే అవకాశాలుంటాయని హెచ్చరించారు. గ్రామాల్లో పాత ఇండ్లు, గుడిశలలో, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే పరిస్థితిలో ఉంటే పోలీస్ వారికి సమాచారం అందిస్తే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని అన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్లపై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉధృతంగా ప్రవహించినా అక్కడికి ఎవరు వెళ్లకుండా రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్, హెచ్చరికల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. అధికారుల ఆదేశాలను అనుసరిస్తూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story