నేతన్నకు చేయూత కరువు..

by Sumithra |
నేతన్నకు చేయూత కరువు..
X

దిశ, రాజోలి : ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గద్వాల చేనేత రంగం కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇక్ష్వాకుల కాలంలో ఇక్కడి వస్త్రాలు యూరప్‌కి ఎగుమతి చేయబడ్డాయి. మనవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పిన చేనేత రంగం కుదేలవుతోంది. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన చేనేత రంగంలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నా కార్మికుల ఆకలి మాత్రం తీర్చడం లేదు.

గద్వాల చీరకు పెట్టింది పేరు...

గద్వాల చేనేత వస్త్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. నైపుణ్యంతో కూడిన నేత విధానంలో నూలు, పట్టు, సికో, కోటకొమ్మ, జరీలతో రూపొందించిన గద్వాల చీరలు ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండే ఈ డిజైన్లు వస్త్ర ప్రేమికుల్ని కట్టిపడేస్తున్నాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో అయితే గద్వాల చీరలు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ కలిగి ఉన్నాయి. చీర డిజైన్, రంగులను బట్టి ఒక్కో చీర పదివేల నుంచి లక్ష రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి.

విదేశాలతో పాటు...

విదేశాలతో పాటు పూణే, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రముఖ నగరాల్లో చేనేత వస్త్రాలకు భారీ డిమాండ్ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల, రాజోలి, ఐజ, ఏ క్లాస్ పూర్, గొర్లకన్ దొడ్డి, గట్టు, మాచర్ల, అరిగిద్ద, అలంపూర్, వనపర్తి, సహా పలు ప్రాంతాల్లో గద్వాల చీరలు తయారు చేస్తారు.

పెట్టుబడి, నైపుణ్యత కరువు..

చేనేత కార్మికులు సొంతంగా ముడి సరుకు కొని చీరను తయారు చేయడానికి పెట్టుబడి, మార్కెటింగ్ చేసే నైపుణ్యం లేక మాస్టర్ వివర్స్ నుంచి ముడి సరుకు తీసుకొని చీరను తయారుచేసి మాస్టర్ వివర్స్ కు అందజేస్తున్నారు.

కనుమరుగు దిశగా చేనేత సహకార సంఘాలు..

ఇక చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి వారికి ఆదాయం అందించాల్సిన చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 24 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం రెండు మూడు సంఘాలు తప్ప మిగిలాయి. దాదాపు చాలా వరకు సంఘాలు మనుగడలో లేవు. దీంతో సొసైటీలు చేనేత కార్మికులకు పని కల్పించే పరిస్థితి లేదు.

ఎవరి లోపం....

గద్వాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మాస్టర్ వివర్లు ఉమ్మడి పెట్టుబడితో ప్రారంభం కావాల్సిన చేనేత పార్కు శంకుస్థాపనకే పరిమితమైంది. గద్వాల మండలం పూడూరు సమీపంలో సమగ్ర చేనేత పార్కు ఏర్పాటు కోసం 47 ఎకరాల స్థలం కేటాయించారు. తొలుత పది ఎకరాల స్థలంలో చేనేత వస్త్రాల తయారీకి అవసరమైన అన్ని విభాగాల భవనాలు మౌలిక సదుపాయాలు వసతులు పరికరాలు ఏర్పాటు చేయాలని భావించారు. 14 కోట్ల 98 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్కుకు కేంద్ర ప్రభుత్వ వాటాగా 4 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు, గద్వాలలో మాస్టర్ వీవర్స్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీగా ఏర్పడి నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడిగా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం సుమారు 24 మంది మాస్టర్ వివర్లు ముందుకు వచ్చారు. కానీ పార్క్ యజమాన్య హక్కులు ఎస్వీవీకి కల్పించాలని వారు డిమాండ్ చేయడంతో అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఇప్పటికే సిద్ధమైన డీపీఆర్ ఆమోదం కోసం ప్రభుత్వం వద్దే పెండింగ్ లో ఉంది.

పథకాల పై నీలి నీడలు..

ప్రస్తుతం చేనేత రంగం మనుగడ ప్రశ్నార్ధకమవుతున్న వేళ గత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కార్మికులను కొద్దో గొప్పో ఆదుకున్నాయి. త్రిఫ్ట్ ఫండ్ పథకం ద్వారా చేనేత కార్మికుడు నెలవారీగా అర్జించే ఆదాయంలో 8శాతం బ్యాంకు ఖాతాలో ఆర్డీ-1లో జమ చేస్తే సర్కారు 16 శాతం డబ్బులు అతడి ఖాతాలో ఆర్డీ-2 రూపంలో జమ చేస్తుంది. ఇలా మూడేళ్లు తర్వాత దాచుకున్న డబ్బుల్ని తిరిగి తీసుకోవచ్చు. ఈ పథకం ద్వారా వచ్చిన డబ్బు కార్మికులకు ఎంతగానో ఉపయోగపడింది. చేనేత మిత్ర అనే పథకం ద్వారా రేషం కొనుగోలుపై 40శాతం సబ్సిడీని నేరుగా చేనేత కార్మికుల ఖాతాలలో జమ చేసేవారు. ప్రస్తుతం ఈ పథకాలను తిరిగి ప్రారంభించకపోవడంతో కార్మికులు ఆందోళన, అయోమయానికి గురవుతున్నారు. అభయ హస్తంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసినా దీనిపైన ఇప్పటివరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత కుటుంబాలు కోరుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed