సూర్యాపేట జిల్లాలో అద్దె గర్భం వ్యాపారం

by Mahesh |
సూర్యాపేట జిల్లాలో అద్దె గర్భం వ్యాపారం
X

దిశ, నల్గొండ బ్యూరో/ సూర్యాపేట టౌన్: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడన్నీ మహిళలు వరం లా భావిస్తారు. కానీ కాలం కలిసి రాక కొందరు తమ అందం చెదిరిపొద్దని మరికొందరు పిల్లల కోసం అద్దె గర్భాలను ఆశ్రయిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ఆస్పత్రుల వారు సరోగసీ పేరుతో దందా కొనసాగిస్తున్నారు. అద్దెగర్భం పేరుతో అక్రమాలకు పాల్పడుతూ అమ్మ తనాన్ని అంగట్లో సరుకుగా మారుస్తున్నారు. ఈ దందాలో జిల్లాలోని పలువురు పేద మహిళలు, ఆసరా లేని గ్రామీణ ప్రాంతాల వారు పావులుగా మారుతున్నారు.హైదరాబాద్ కు చెందిన పలు ఆసుపత్రుల నిర్వాహకులు జిల్లాలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారాన్ని విచ్చలవిడిగా సాగిస్తున్నారు.ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రాల్లోని ఓ మహిళ సరోగసి పద్ధతిని ఎంచుకోవాలని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ ను ఆశ్రయించింది. డాక్టర్ సలహా మేరకు సరోగసి పద్ధతి కోసం జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఓ మండలానికి సంబంధించిన ఓ ఎస్టి కులానికి చెందిన మహిళను ఆశ్రయించి బేరసారాలు ఆడినట్టు సమాచారం. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి బయటకు పొక్కింది. ఇప్పుడు ఈ విషయంపై జిల్లా అంతట చర్చ సాగుతోంది.

ప్రక్రియ పూర్తయ్యే వరకు రూ. మూడు లక్షలు

సూర్యాపేట జిల్లాలో ఉన్న పలు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు కొందరు ఆర్ఎంపీల సహకారంతో తమ వైద్య వ్యాపారం సాగించుకుంటూనే సరోగసికి ఆద్యం పోస్తున్నారు. దీనికి సంబంధించిన ఆస్పత్రుల నిర్వాహకులు రాజధానిని నెట్ వర్కుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. తమ ఏజెంట్ల ద్వారా జిల్లాలోని పలు గ్రామాల్లో పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా పేద మహిళలతో బేరం మాట్లాడుకుని వారిని తీసుకెళ్తున్నట్లు వినికిడి. గర్భం దాల్చిన అప్పటినుంచి ఆ మహిళను తమ వద్దనే ఉంచుకొని అన్ని ఖర్చులు వారే భరిస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం మూడో కంటికి తెలియకుండా ఇంటికి పంపిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తానికి మూడు దఫాలుగా మొత్తం రూ..మూడు లక్షల రూపాయలను మహిళలకు చెల్లిస్తుండగా అందులోనే గర్భం దాల్చిన తర్వాత నెల వారి ఖర్చులను కూడా లెక్కిస్తున్నట్టు సమాచారం. అలా వారు బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఆయన ఖర్చులను లెక్కించి ఆ తర్వాత మిగిలిన నగదును ఇచ్చి తమ వెంట పంపుతున్నట్టు తెలిసింది.

ఈ గర్భం వెనుక కాసుల మర్మం వేరే ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే ఈ దందాలో మధ్యవర్తులు అందిన కాడికి దండుకుంటున్నారని సమాచారం. బిడ్డల తల్లిదండ్రుల నుంచి రూ. పది లక్షలు వసూలు చేస్తుండగా గర్భం దాల్చిన మహిళలకు ఖర్చులు పోను రూ. రెండు లక్షలు మాత్రమే ఇస్తున్నట్టుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ వ్యవహారంలో కొందరు ఆర్ఎంపీలు గతంలో సరోగసికి వెళ్లొచ్చిన మహిళలల ను మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ రెండువైపులా కమీషన్ తీసుకొని సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. రూ.10 లక్షల కాక ఆ పైన ఇంకో పది లక్షలు మాట్లాడుకొని వీరు చెరో ఐదు లక్షలు చొప్పున పంచుకుంటున్నట్లు సమాచారం. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ దందా సాగుతుండటంతో భువనగిరి జిల్లాలో సంబంధిత అధికారులు గుట్టు రట్టు చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నారు. అలాగే సూర్యాపేట జిల్లాలోని ఓ డివిజన్ లో ఇలాంటి సరోగసి పద్ధతి జరగడంతో అప్పటి అధికారులు గుట్టురట్టు చేసి వారిపై కేసులు దాఖలలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

చట్ట ప్రకారం సరోగసి పొందాలంటే

సరోగసి విధానం ద్వారా బిడ్డను పొందాలంటే అనేక నిబంధనలు ఉన్నాయి. సరోగసి ద్వారా బిడ్డను పొందాలనుకునే వారికి బంధుత్వానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం,మెజిస్ట్రేట్ కోర్టు ఆమోదించిన సరోగేట్, పిల్లల తల్లిదండ్రుల కస్టడీ ఆర్డర్ ఉండాలి. అద్దె గర్భం ఇచ్చే మహిళ సదరు దంపతుల్లో ఎవరో ఒక్కరికి దగ్గర బంధువై ఉండాలి. ఒకసారి మాత్రమే గర్భం ఇచ్చేందుకు అనుమతి ఉంటుంది. అంతేకాకుండా అద్దె గర్భం ఇచ్చిన మహిళకు ప్రసవానంతరం సమస్యలకు కవర్ చేసేలా 24 నెలల కాలానికి బీమా కవరేజ్ కూడా చేయించాల్సి ఉంటుంది.కానీ జిల్లా నుంచి వెళ్తున్న మహిళలకు అలాంటి వేమి తెలియకుండానే సరోగసి చేయిస్తున్నారు. కేవలం ఇక్కడి నుంచి తీసుకెళ్లడం ప్రసవం కాగానే వెంటనే నగదు సెటిల్ చేసి పంపించడం జరుగుతుందన్న ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. ఒకే మహిళను రెండు మూడు సార్లు కూడా అద్దె గర్భం కోసం తీసుకెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇప్పటికే జిల్లా నుంచి పలువురు..

అనైతికమైన అద్దె గర్భం వ్యాపారం జిల్లాలో జోరుగానే సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న ఓ మండలంలోని తండా కు చెందిన ఇద్దరు మహిళలు వెళ్లొచ్చినట్టు సమాచారం. సూర్యా పేట కు అనుకొని ఉన్న ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ సరోగసి పద్ధతి ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చి వాళ్ల చేతిలో బిడ్డ‌ను పెట్టి నగదు తీసుకొని వచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌ని జిల్లా కేంద్రంలోనీ ఓ ఆర్ఎంపీ ఈ విషయంపై డాక్టర్ ని సంప్రదించగా డాక్టర్ సలహా మేరకు ఓ మహిళను హైదరాబాద్ కు పంపించే సమయంలో ఈ ఆర్ఎంపి కి డబ్బులు రాకపోవడంతో హాస్పిటల్ నిర్వాహకుడితో వాగ్వాదం జరగడంతో ఈ సరోగసి వివాదం బయటకు పొక్కింది.

మా దృష్టికి రాలేదు: కోటాచలం,డీఎంహెచ్వో

సూర్యాపేట జిల్లాలో అద్దె గర్భం కోసం ప్రైవేట్ హాస్పిటల్ ని బాధితులు సంప్రదించినట్టు మా దృష్టికి రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సరోగసి పద్ధతి చేస్తే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి. సరోగసి పద్ధతికి నిబంధనలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా చేస్తే హాస్పిటల్ తో పాటు డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story

Most Viewed