మోదీకి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదు: సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి

by Shiva |
మోదీకి తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదు: సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి
X

దిశ, కరీంనగర్ టౌన్: సీసీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్న నరేంద్ర మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి, నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో లాభాలతో నడుస్తున్న సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కుట్రలు పన్నుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చని మోదీ తెలంగాణకు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. గిరిజన, హార్టికల్చర్, అగ్రికల్చర్, యూనివర్సిటీలు, వైద్య కళాశాలను, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వని మోదీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు లిఖిత పూర్వక హామీలిచ్చి అమలు చేయకుండా రైతాంగాన్ని మోసం చేశారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజానీకంపై భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అభివృద్ధిపై మాట్లాడకుండా కరీంనగర్ ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు వర్ణ వెంకట్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, ఎస్.రజనీకాంత్, నరేష్ పటేల్, నాయకులు తిప్పారపు సురేష్, కవ్వంపల్లి అజయ్, జి.తిరుపతి, గజ్జెల శ్రీకాంత్, పున్నం రవి, రాయికంటి శ్రీనివాస్, గాజుల కనకరాజు, రోహిత్ అజయ్, శివ, కుమార్ చందు, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story