జీవన్ రెడ్డి పట్ల ఇష్టారీతిలో మాట్లాడితే ఖబడ్దార్ : డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్

by Shiva |
జీవన్ రెడ్డి పట్ల ఇష్టారీతిలో మాట్లాడితే ఖబడ్దార్ : డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : పచ్చి అబద్దాలకు కేరాఫ్ గా బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై ఇష్టరీతిలో మాట్లాడితే ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. జగిత్యాల ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొన్న దళిత బంధు పథకంలో అక్రమాలకు పాల్పడిన వారి చిట్టా ఉందని సీఎం కేసీఆర్ అంటే ఆ విషయంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడరన్నారు.

ఇందులోనూ అసభ్యంగా మాట్లాడలేదని, కేవలం దళితులకు బడ్జెట్ లో కేటాయించిన నిధులను ఎందుకు ఖర్చు చేయలేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారన్నారు. కానీ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జగిత్యాలలో మీడియా సాక్షిగా జీవన్ రెడ్డి పచ్చి అబద్దాలు ఆడుతున్నారని, స్థాయి మరిచి మాట్లాడుతున్నాడని ఆరోపించడం సరి కాదన్నారు. స్థాయిని మించి జీవన్ రెడ్డిని విమర్శిస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో తెచ్చిన ఎస్సీ సబ్ ప్లాన్ తో ఎందరో దళితులకు మేలు జరిగిందన్నారు.

సబ్ ప్లాన్ నిధులపై నిలదీస్తే జవాబు చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.17,700 వందల కోట్లు ఎందుకు ఖర్చు చేయలేదని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను దారిమళ్లించిన విషయాన్ని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నిరూపిస్తామన్నారు. అందుకు మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.

123 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకొంటున్న కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకృష్ణ, బాల్క సుమన్ మీ నియోజకవర్గాలలో నిరుపేదలకు ఎన్ని డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారో.. ఎంతమందికి దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారో.. ఎంతమంది దళిత యువతకు ఉద్యోగలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అనంతరం చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి మెడిపెల్లి సత్యం మాట్లాడుతూ కులాలకు, మతాలకు అతీతంగా తెలంగాణ సమాజం చేత గౌరవింపబడుతున్న నాయకుడు జీవన్ రెడ్డి అని, ఇలాంటి నాయకుడిపై చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ స్థాయి మరిచి మాట్లాడారని అన్నారు. ఇక ముందైనా నోరు ఆదుపులో పెట్టుకోవాలని సత్యం హెచ్చరించారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏర్పడిన అభద్రత భావంతో జీవన్ రెడ్డిపై అనవసరపు మాటలు మాట్లాడారన్నారు. ఈ సమావేశంలో బండ శంకర్, దుర్గయ్య, నక్క జీవన్, మున్న, గుండా మధు, బీరం రాజేష్, రమేష్ బాబుతో పాటు పలువురు ఉన్నారు.

Advertisement

Next Story