రైతున్నలు అధైర్యపడొద్దు : ఏఎంసీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి

by Shiva |   ( Updated:2023-05-31 09:55:23.0  )
రైతున్నలు అధైర్యపడొద్దు : ఏఎంసీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి
X

దిశ, జమ్మికుంట : మొక్కజొన్న రైతులు అధైర్యపడొద్దని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మిటి సమ్మిరెడ్డి రైతులకు భరోసానిచ్చారు. బుధవారం దిశ పత్రికలో వచ్చిన 'మక్క రైతులు ఆగమాగం' అనే కథనానికి స్పందించిన ఆయన బుధవారం జమ్మికుంట మార్కెట్ ను సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మొక్కజొన్న రైతులు మార్కెట్ యార్డులో వారు ఎదుర్కొంటున్న సమస్యలను సమిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో వెంటనే సమ్మిరెడ్డి మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ దివ్యభారతితో ఫోన్లో మాట్లాడారు. సిబ్బంది, గన్ని సంచుల కొరత, మక్కలు తడిసిన తీరు, తదితర అంశాలను ఆమె దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పడంతో జిల్లా మేనేజర్ అందుకు పూర్తి సహకారం అందిస్తూ, మక్కల కొనుగోలును వేగవంతం చేస్తామని సమ్మిరెడ్డికి హామీ ఇచ్చారు. అనంతరం తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ... రైతన్నలెవరూ అధైర్య పడొద్దని ప్రభుత్వం మక్కలను కొనుగోలు చేస్తుందన్నారు.

ఇందుకోసం రైతుల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ మొక్కజొన్నల కొనుగోలుకు రూ.350 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. మొక్కజొన్న రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మార్కెట్ యార్డ్ లోనే మక్కలను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. స్థానిక అధికారులు తేమ శాతం, పంట మార్పిడి, ఆన్ లైన్ నమోదు తదితర వాటి పేరిట రైతులను ఇబ్బందుల పాలు చేయకుండా వెంటనే మొక్కజొన్న కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవుల తిరుపతి, మార్కెట్ కమిటీ కార్యదర్శి రెడ్డి నాయక్, మార్క్ ఫెడ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story