అధైర్య పడొద్దు ప్రభుత్వం పక్షాన అండగా ఉంటాం

by Sridhar Babu |
అధైర్య పడొద్దు ప్రభుత్వం పక్షాన అండగా ఉంటాం
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : అధైర్య పడొద్దు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస భరోసానించారు. సిరిసిల్ల పట్టణం గణేష్ నగర్ కు చెందిన నేత కార్మికుడు ఎర్రం కోమ్రయ్య మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకొని మరణించగా బుధవారం కోమ్రయ్య కుటుంబాన్ని ఆయన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును వారికి అందజేశారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, క్షణికావేషంలో బలవన్మరణాలకు పాల్పడి కుటుంబాలను రోడ్డున పడేయవద్దన్నారు.

నేతన్నలకు ఏడాది పొడుగునా ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైచిలుకు బకాయిలను చెల్లించిందని, అతి త్వరలో మరో నలభై కోట్లు బకాయిలు చెల్లించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యారన్ డిపో సిరిసిల్లలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని, అతి త్వరలో పొదుపు సంఘాలకు ఇచ్చే రెండు చీరల ఆర్డర్లు కూడా నేతన్నలకు ప్రభుత్వం ఇవ్వనుందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్లన్నీ సిరిసిల్ల నేతన్నలకే ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుందన్నారు. నేతన్నలకు నిరంతరం ఉపాధి కల్పించడానికి తనవంతు కృషి చేస్తానని, ఎవ్వరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖ అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed