Asha workers : న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలి..

by Sumithra |
Asha workers : న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలి..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు నిరసన కొనసాగించి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు 18 వేల రూపాయల వేతనం అందించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆశాలకు నష్టం కలిగించే పరీక్షలు పెట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకొని, సీనియారిటీని బట్టి ఏఎన్ఎం, జీఎన్ఎం ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. విపరీతమైన పని ఒత్తిడి నుండి విముక్తి కలిగించి, పై అధికారుల నుంచి వేధింపులు లేకుండా చూడాలన్నారు. అలాగే తమ న్యాయబద్ధమైన 24 రకాల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడుతూ ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలంటూ అనేక పోరాటాలు చేసిన సందర్బాలలో, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిందన్నారు. అంతే కాకుండా ఎన్నికల సందర్భంగా పలు హామీలతో పాటు మేనిఫెస్టోలో కూడా ఆశాల సమస్యలు ప్రస్తావించిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు. ఆశా కార్యకర్తల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించని పక్షంలో, వచ్చే 30న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులతో పాటు పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed