- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ సర్వేలో గందరగోళం..దరఖాస్తుదారుల పేర్లు గల్లంతు
దిశ,హుజూరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా గతంలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇండ్లు లేని పేదలు దరఖాస్తులు సమర్పించారు. అయితే ప్రస్తుతం దరఖాస్తుదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు. మరికొందరి పేర్లు పక్క మండలాలతో పాటు ఏకంగా ఇతర మున్సిపాలిటీల జాబితాలో చూపిస్తుండడంతో ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక సతమతమవుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న జాబితాలో లబ్ధిదారుల పేర్లు కనిపించకపోవడం అయోమయానికి గురి చేస్తుంది. ఈ క్రమంలో దరఖాస్తుదారులు స్థానికంగా ఉన్న అధికారులను సంప్రదించగా జాబితాలో మార్పుకు గాని దరఖాస్తుల బదిలీకి గాని తమకు అధికారాలు లేవని చెబుతున్నారు.
ఆన్‌లైన్ నమోదులో తప్పిదాలే కారణమా?
ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను ఆయా మండల కేంద్రాలు మున్సిపాలిటీల్లో డిజిటలైజ్ చేశారు. ఇలా డేటా ఎంట్రీ సమయంలో అనుకోకుండా జరిగిన తప్పిదాలే దరఖాస్తుదారుల జాబితాలో గందరగోళానికి దారి తీసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా సర్వే కోసం వస్తున్న అధికారుల వద్ద ఉన్న జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేసినట్టు సర్వేకు వచ్చిన అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమకు ఎలాంటి అధికారాలు లేవని తెలియ చెబుతున్నారు. లబ్ధిదారుల ఎంపికలు ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో వివరాలు నమోదు చేస్తుండగా అసలు దరఖాస్తులదారుల జాబితాలోనే పేర్లు మాయమవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పిదాలపై స్థానికంగా ఉండే అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేకపోవడంతో పలువురు దరఖాస్తుదారులు ప్రజావాణి గ్రీవెన్స్‌లో వినతి పత్రాలు అందజేశారు.
సర్వే గడువు ఈనెల 31వరకే...
దరఖాస్తుదారుల జాబితాలో తప్పిదాలు దొర్లడంపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ తాము ఏమి చేయలేమంటూ స్థానికంగా ఉండే అధికారులు చేతులెత్తేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. తమకు అందిన దరఖాస్తుదారుల జాబితా ప్రకారం డిసెంబర్ 31లోగా ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వే పూర్తి చేయాలని ఆదేశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే కొందరు అధికారులు మాత్రం రెండవ జాబితాలో అర్హులైన పేదల పేర్లు పరిశీలనకు వస్తాయని చెబుతున్నప్పటికీ దరఖాస్తుదారులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో సర్వే సమయాన్ని మరికొన్ని రోజులు పొడిగించడం తో పాటు ఇతర ప్రాంతాల జాబితాలో వచ్చిన వారి దరఖాస్తులు సొంత గ్రామాలు, మండలాలకు మార్చుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. సమస్య మరింత జటిలం కాకముందే అర్హులైన పేదలందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని, లేనిపక్షంలో బాధితులు ధర్నాలు, రాస్తారోకోలు చేసే పరిస్థితి రావచ్చని సీఐటీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముకుందరెడ్డి హెచ్చరించారు.
పేర్లు ఎలా బదిలీ అయ్యాయో అర్థం కావడం లేదు : సుమలత, సర్వేయర్
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో సర్వే బాధ్యతలు చూసుకున్నాను. అయితే కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన బొబ్బటి అనిత, పెద్దపల్లి రమ అనే ఇద్దరు మహిళల పేర్లు మా జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. వాస్తవంగా వీరిద్దరు కరీంనగర్‌లోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ జమ్మికుంట మున్సిపాలిటీకి ఈ పేర్లు ఎలా బదిలీ అయ్యాయో అర్థం కావడం లేదు. హుజూరాబాద్‌కు చెందిన మరికొందరి పేర్లు కూడా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో వచ్చాయి.
జాబితాలో పేర్ల గందరగోళం నిజమే : సర్వేయర్ శ్రావణ్, ఉద్యోగి
హుజూరాబాద్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పద్మ అనే పేద మహిళ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా ఆమె పేరు మాత్రం కరీంనగర్ జిల్లా కేంద్రం జాబితాలో వచ్చింది. దరఖాస్తు చేసిన మహిళకు భర్త లేడని.. ఉండటానికి ఇల్లు కూడా లేదని గ్రామస్తులు తెలిపారు. అదే విధంగా హుజూరాబాద్ పట్టణంలో ఒక వార్డులో దరఖాస్తు చేసుకుంటే మరో వార్డు జాబితాలో తమ పేర్లు ప్రత్యక్షమై నట్లు అనేకమంది చెప్తున్నారు. ఇలా జరిగిన విషయం నిజమేనని మా దృష్టికి వచ్చింది.
హుజూరాబాద్ అయితే జమ్మికుంటలో పేరు వచ్చింది : తిరునగరి రమ్య, లబ్ధిదారు, హుజూరాబాద్
మాది హుజూరాబాద్ పట్టణంలోని 23వ వార్డు. ఇందిరమ్మ ఇంటి కోసం మా వార్డులో దరఖాస్తు చేసుకుంటే పేరు మాత్రం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో వచ్చింది. మా దరఖాస్తును జమ్మికుంట నుంచి హుజూరాబాద్‌కు మార్చాలని కోరగా తమకు చేంజ్ చేసే అధికారం లేదంటూ అధికారులు చెబుతున్నారు. అందుకే ప్రజావాణి కార్యక్రమం ద్వారా నేరుగా గ్రీవెన్స్ లో వినతి పత్రం ఇచ్చి సమస్యను పరిష్కరించాలని కోరాను.