బాధ్యత మరిచిన విద్యుత్ సిబ్బంది

by Anjali |
బాధ్యత మరిచిన విద్యుత్ సిబ్బంది
X

దిశ, చిగురుమామిడి: అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సిన విద్యుత్ ఉద్యోగులు తమ బాధ్యతను మరిచారు. తమ ఫోన్‌లను స్విచ్చాఫ్ చేసి విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజలకు విద్యుత్తు కోతలు నివారించాలనే గొప్ప సంకల్పంతో ముందుకు వెళుతుంటే, చిగురుమామిడి మండల కేంద్రంలో విధులు సక్రమంగా నిర్వహించాల్సిన విద్యుత్ ఉద్యోగులు మాత్రం తమ ఇస్తానుషారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు అనేకం వినిపిస్తున్నాయి.

గత మూడు రోజుల నుండి చిగురుమామిడి మండల కేంద్రంలో అర్ధరాత్రి అయిందంటే చాలు కరెంటు కోతలు ప్రజలను ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలే ఎండాకాలం.. పగటి ఉష్ణోగ్రతతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరుగుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎండల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పొద్దంతా ఏదో పనిచేసే రాత్రి కాసేపు విశ్రమించుకుందామనే సమయానికే కరెంటు పోవడం సర్వసాధారణమైంది. శనివారం, ఆదివారం అర్ధరాత్రి మండల కేంద్రంలో ఓపక్క కరెంటు ఉన్నప్పటికీ, గ్రామంలో మరోపక్క కరెంటు పోయిందని సంబంధిత శాఖ కార్యాలయానికి అర్ధరాత్రి ఫోన్లు చేసి తెలిపితే, అక్కడ విధులు నిర్వహిస్తున్న విద్యుత్ ఆపరేటర్లు మా సార్లు మా ఫోన్లను కూడా లిఫ్ట్ చేయడం లేదని తెలపడం గమనార్హం.

విద్యుత్ వినియోగదారులు ఆ శాఖ అధికారులకు ఫోన్లు చేసినప్పటికీ, వారి ఫోన్లను లిఫ్ట్ చేయలేకపోవడంతో ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎప్పుడో అర్ధరాత్రి పోయిన కరెంటు, ఉదయం పది గంటలయినప్పటికీ రాకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోనే ఉంటూ విధులు నిర్వహించాల్సిన అధికారులు కరీంనగర్, హుస్నాబాద్ వంటి పట్టణాల్లో నివాసం ఉంటున్నారు.

దీనితో అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ వినియోగదారులకు వారి సేవలను అందించలేకపోతున్నారు. నెలనెలా ప్రజల నుండి కరెంటు బిల్లులు ముక్కు పిండి వసూలు చేస్తున్న విద్యుత్ శాఖ అధికారులు, విద్యుత్ వినియోగదారులకు సరైన సేవలు అందించకపోవడంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధ్యతు మరిచి విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బందిపై ఆ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story