మీకిదే చివరి అవకాశం.. MLC కవిత లాయర్లపై జడ్జి అసహనం

by Gantepaka Srikanth |
మీకిదే చివరి అవకాశం.. MLC కవిత లాయర్లపై జడ్జి అసహనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫున హాజరైన న్యాయవాదులపై రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా అసహనం వ్యక్తం చేశారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా విచారణను వాయిదా వేయాలంటూ స్పెషల్ జడ్జీని కవిత తరఫు లాయర్ రిక్వెస్టు చేశారు. దీనికి స్పందించిన కావేరీ బవేజా... కవిత తరఫున రెగ్యులర్‌గా హాజరయ్యే న్యాయవాదులు నితీష్ రాణా, మోహిత్‌రావులు ఈ రోజు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికే సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా రెండుసార్లు విచారణ వాయిదాను కోరారని, ఇకపైన అనుమతి ఇచ్చేది లేదని, ఇదే చివరి అవకాశమంటూ వారికి ఆమె వివరించారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నానని, ఆ రోజు వాదనలు వినిపించకుంటే పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సి వస్తుందని సున్నితంగా హెచ్చరించారు.

తదుపరి విచారణ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరగనున్నందున డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై కవిత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించాల్సిందేనని, మరోసారి వాయిదాకు అనుమతించబోమని కావేరీ బవేజా స్పష్టం చేశారు. ఆ రోజు జరిగే విచారణనే చివరిగా ఉండాలని, తుది వాదనలను ఆ సందర్భంగానే వింటామని నొక్కిచెప్పారు. దీంతో ఆగస్టు 7న కవితకు బెయిల్ మంజూరు విషయమై క్లారిటీ రానున్నది. వాదనలు ముగిసిన వెంటనే తీర్పును ప్రకటిస్తారా?... లేక రిజర్వులో ఉంచి మరో రోజు వెల్లడిస్తారా?.. అనేది తేలనున్నది.

Advertisement

Next Story