కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఆ స్థానంలో ఓటమి తప్పదన్న తాజా సర్వే

by Prasad Jukanti |   ( Updated:2024-04-16 13:36:47.0  )
కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఆ స్థానంలో ఓటమి తప్పదన్న తాజా సర్వే
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు దక్కించుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న వేళ సికింద్రాబాద్ సెగ్మెంట్ రాజకీయం రంజుగా మారింది. ఈ స్థానాన్ని మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరిగి బరిలో నిలవగా కాంగ్రెస్ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీలో ఉన్నారు. అయితే తాజాగా జన్ లోక్ పోల్ నిర్వహించిన సర్వేలో సికింద్రాబాద్ గడ్డపై మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని తేలడం ఆసక్తిగా మారింది.

దానంపై వ్యతిరేకత..

ఈ సర్వే ప్రకారం బీజేపీ 36.77 శాతం ఓట్ షేర్‌తో మొదటి స్థానం దక్కించుకోబోతుండగా 31.05 శాతం ఓట్లతో రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి నిలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ మూడో స్థానానికి పరిమితం కాబోతున్నట్లు సర్వే అంచనా వేసింది. గత అసెంబ్లీ ఎన్నిక్లలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపొందిన దానం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో కండువా మార్చి సికింద్రాబాద్ టికెట్ దక్కించుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో దానం పట్ల సానుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వే అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ దానం థర్డ్ ప్లేస్‌కు పడిపోవడం అధికార పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా..

కాగా ఈ సెగ్మెంట్‌లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా నాంపల్లి, ఖైరతాబాద్ మినహా మిగతా 5 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నా బీఆర్ఎస్ రెండో స్థానానికే పరిమితం కాబోతున్నదని ఈ సర్వే అంచనా వేసింది. కిషన్‌రెడ్డి అనుభవంతోపాటు కేంద్రంలోని మోడీ చరిష్మాతో కాషాయ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed