భట్టికి వీఆర్వోల జేఏసీ కీలక విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం

by Bhoopathi Nagaiah |
భట్టికి వీఆర్వోల జేఏసీ కీలక విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో గతంలో సేవలందించిన వీఆర్వోలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని వీఆర్వో జేఏసీ కోరింది. శనివారం ఆయన్ని కలిసి ఈ మేరకు మెమోరండం సమర్పించారు. ఈ సందర్భంగా వీఆర్వో జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ మాట్లాడుతూ.. ప్రజల సేవలో వీఆర్వోల అనుభవం, విశిష్ట సేవల ప్రాముఖ్యతను వివరించినట్లు చెప్పారు. వీఆర్వోలు అనేక ఏండ్లుగా ప్రభుత్వ భూముల రక్షణ, రైతుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలులో నిబద్ధతతో పని చేశారు. ప్రతి పథకాన్ని ప్రజల గృహాలకు తీసుకెళ్లడంలో వారి పాత్ర అపారమైనదిగా తెలిపారు. ఈ వ్యవస్థ రద్దుతో గ్రామీణ వ్యవస్థలో అనేక సమస్యలు తలెత్తాయి. ప్రజలు, రైతులు ప్రభుత్వ సేవలకు నోచుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు.

గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం చట్టబద్ధత లేకుండా వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. రద్దయిన వీఆర్వో వ్యవస్థ వల్ల తాము కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రమోషన్ అవకాశాలు లేవు. అనేక సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ వీఆర్వోలు సరైన హోదాలు పొందలేకపోతున్నారు. అనుభవజ్ఞులైన వీఆర్వోలను సమర్థంగా ఉపయోగించుకోవడం వల్ల గ్రామీణ పాలన మరింత మెరుగుపడుతుంది. రద్దయిన వీఆర్వోలను తిరిగి నియమించడం వల్ల అదనపు ఖర్చు ఉండదు. రైతుల భూ సమస్యల పరిష్కారించేందుకు ఉపయోగమన్నారు. భట్టి విక్రమార్క కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌గా, వీఆర్వోల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంని కలిసిన వారితో గోల్కొండ సతీష్ తో పాటు అదనపు సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేష్ ఉన్నారు.

Next Story